
హైదరాబాద్, వెలుగు: అర్బన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థల భద్రతను మెరుగుపరిచేందుకు అండర్‌గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థే ఉత్తమమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ అవసరమన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో కూడిన బృందం మంగళవారం బెంగళూరులో పర్యటించింది.
అక్కడి అధికారులతో సమావేశమై, అండర్‌గ్రౌండ్(యూజీ) విద్యుత్ సరఫరా వ్యవస్థపై అధ్యయనం చేసింది. ముందుగా కర్నాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్), బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్(బెస్కం) అధికారులతో భట్టి సమావేశమై, వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అండర్‌గ్రౌండ్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
యూజీ విద్యుత్ కేబుల్స్ ప్రాజెక్టుకు బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు, ఓఎఫ్సీ వాణిజ్య ఉపయోగం, రింగ్ మైన్ యూనిట్ల వంటి అంశాలపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు శివార్లలోని మల్లేశ్వరం15వ క్రాస్ వద్ద కొనసాగుతున్న ప్రాజెక్టును కూడా భట్టి సందర్శించారు. అక్కడ అండర్‌గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భూమిలో ఏర్పాటు చేసిన చాంబర్లలో ట్రాన్స్ఫార్మర్లు, వీధి స్థాయిలో నిర్వహణకు సౌలభ్యమైన ప్యానెల్స్‌ను పరిశీలించారు. ఇది పట్టణ ప్రాంతాల్లో స్థల వినియోగం, భద్రతను మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు.