సీతారామ ద్వారా కొత్తగా..3.28 లక్షల ఎకరాలకు నీళ్లు : డిప్యూటీ సీఎం భట్టి

సీతారామ ద్వారా కొత్తగా..3.28 లక్షల ఎకరాలకు నీళ్లు : డిప్యూటీ సీఎం భట్టి
  • కృష్ణా, గోదావరి జలాల వాటాల సాధనలో రాజీ పడబోం: డిప్యూటీ సీఎం భట్టి 
  • ఖమ్మంలో జాతీయ జెండావిష్కరణ 

ఖమ్మం, వెలుగు:  సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,57,574 ఎకరాలు, ఖమ్మంలో 1,62,830 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 9,196 ఎకరాల ఆయకట్టు ఉందని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 49,935 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,96,925 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 5,634 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.

శుక్రవారం స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తాము బాధ్యతలు స్వీకరించగానే టీజీపీఎస్సీని సంస్కరించామని, 20 నెలల్లో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా సాధనలో రాజీ పడబోమని, శాశ్వత హక్కుల సాధనలో విజయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తుందన్నారు.

‘‘గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, సాయం చేశాం. జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఉగాది నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా ఇస్తున్నాం’’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.