బీఆర్ఎస్ హయాంలో సంక్షోభం.. మేం వచ్చాక ఆర్థిక వ్యవస్థను సెట్ చేసినం: భట్టి 

బీఆర్ఎస్ హయాంలో సంక్షోభం.. మేం వచ్చాక ఆర్థిక వ్యవస్థను సెట్ చేసినం: భట్టి 

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ఆర్థిక, విద్యుత్ వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలో భట్టి మాట్లాడారు.

తుక్కుగూడ సభ చారిత్రాత్మకం కానుందని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడి నుంచే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ‘‘ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం” అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన ప్రక్రియ మొదలుపెట్టామని పేర్కొన్నారు. మహిళలకు  రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.