తెలంగాణ బడ్జెట్ 2024: ఉచిత కరెంట్ కోసం రూ.2 వేల 418 కోట్లు

తెలంగాణ బడ్జెట్ 2024:  ఉచిత కరెంట్ కోసం రూ.2 వేల 418 కోట్లు

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు  డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క.  ఫిబ్రవరి 10వ తేదీ శనివారం అసెంబ్లీలో  భట్టీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు. హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని.. త్వరలోనే మరో రెండు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని తెలిపారు. 

ఈ నెలలోనే గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందిస్తామని చెప్పారాయన. ఇందుకోసం విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి బడ్జెట్ రూ.2 వేల 418కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకున్నా.. ఇచ్చినట్లు ప్రచారం చేసిందని విమర్శించారు. విద్యుత్ డిస్కంలకు నిధులు చెల్లించకపోవడంతో.. అవి అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. రాష్ట్రంలో ట్రాన్స్ కో, డిస్కమ్ లకు ఈ బడ్జెట్ లో రూ.16 వేల 825 కోట్లు కేటాయించడం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు.