దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • వాటాకు తగ్గట్లు నిధులు పంపిణీ చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలకు వాటాకు తగ్గట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిణీ చేయడం లేదని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. పలు సూచనలు చేశారు. ‘‘దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నాయి. 

అయినప్పటికీ తిరిగి రాష్ట్రాలకు నిధులు చెల్లింపులో కేంద్రం సరైన వాటా రిలీజ్ చేయడం లేదు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా రేట్ రేషనలైజేషన్ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాం. అయితే, దానికి సరైన యంత్రాంగం ఉండాలి. అందుకోసం ఇప్పుడు అమల్లో ఉన్న పరిహార సెస్సు కొనసాగించాలి. దానివల్ల సమకూరే ఆదాయం పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇవ్వడం వీలుగాకపోతే.. పరిహార సెస్సు రద్దు చేసి.. సిగరెట్లు, మద్యం, లగ్జరీ వస్తువులపై జీఎస్టీ పెంచాలి. అలా వచ్చే అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు కేటాయించాలి. ఇలా చేయడంతో సాధారణ పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుంది. పేద, మధ్య తరగతి వారి కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించే అవకా శం ఉంటుంది’’అని భట్టి అన్నారు. 

నిర్మలా సీతారామన్​తో భట్టి భేటీ

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను ఆమె ఆఫీస్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంబంధిత అంశాలపై చర్చించారు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రధానంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను తెలియజేశారు.