కలెక్టర్ ఖాతాలో దళితబంధు నిధులు.. లబ్ధిదారులు చక్కగా వ్యాపారం చేసుకోండి

కలెక్టర్ ఖాతాలో దళితబంధు నిధులు.. లబ్ధిదారులు చక్కగా వ్యాపారం చేసుకోండి

ఖమ్మం : దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాల్లో ఉన్నాయని, లబ్ధిదారులు ఎంచుకున్నవృత్తి, వ్యాపారం నిర్వహిస్తూ దశల వారీగా పొందాల్సిన నిధులను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడుత నిధులకు సంబంధించిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, దళిత బంధు లబ్ధిదారులం దరికీ నిధుల పంపిణీ కొనసాగుతుందని ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు వారికి చెక్కులు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. చింతకాని మండలంలో మొత్తం 3,465 మంది లబ్ధిదారులు ఉండగా వారికి సంబంధించిన నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. మొదటి విడుత నిధులు పొందిన వారిలో 1,387 యూనిట్ల వారు తమకు కేటాయించిన యూనిట్లను విక్రయించడం, నిధులు దారి మళ్లించడం చేశారన్నారు.

 దళిత బంధు యూనిట్లు ఇతరులు కొనుగోలు చేయడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. దళితబంధు యూనిట్లపై జిల్లా అధికారులు విచారణ నిర్వహిస్తున్నట్లు వివరించారు. 214 మంది లబ్ధిదారుల విచారణ పూర్తి చేసి రెండో విడుత నిధులు పొందేందుకు అర్హులని గుర్తించి చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులు వృత్తి, వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. దారి తప్పిన యూనిట్ల వివరాలు ఇస్తే అధికారులు వాటిని విచారించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అధికారులు పాల్గొన్నారు.