
- కక్ష సాధించాలనుకుంటే ఇప్పటికే లోపలేసేవాళ్లం
- ఘోష్ నివేదికను చెత్త రిపోర్ట్ అంటరా?
- మేం కక్ష సాధించం.. చట్ట ప్రకారమే చర్యలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
హైదరాబాద్, వెలుగు: తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అందరినీ లోపలికి పంపేవాళ్లమని బీఆర్ఎస్సభ్యులనుద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికనే చెత్త రిపోర్ట్ అంటారా? అని ఫైర్ అయ్యారు. ‘‘జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అది చెత్త రిపోర్టు అంటున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు దేనికి ఒప్పుకుంటారు? మీరంతా చట్టానికి అతీతులా? దైవాంశ సంభూతులా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదని, ఎలాంటి చర్యలైనా చట్ట ప్రకారమే తీసుకుంటామని స్పష్టంచేశారు. తమకు ఆ ఆలోచనే ఉంటే ప్రాజెక్టు కుంగిపోగానే.. ఏం చేయాలో అది చేసే వాళ్లమని, కానీ అలా చేయలేదన్నారు. జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ చేయించి, ఆ రిపోర్టును ప్రస్తుతం ఏం చేయాలనే దానికోసమే సభ ముందు పెట్టామని తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేహరీశ్రావు రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించేందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను చెత్త రిపోర్ట్ అనడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.. ఘోష్ పైనా, ఎన్డీఎస్ఏ రిపోర్టుపైనా అపవాదులు వేస్తున్నారనీ, మంత్రులు మాట్లాడితే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రాణహిత-చేవెళ్లను వదిలేసి కాళేశ్వరం ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో 2007లో అనుమతి పొంది 2009లో ప్రారంభించిన ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి ఉంటే, కేవలం రూ. 38 వేల కోట్లతో 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని భట్టి తెలిపారు. ఏడు జిల్లాలకు తాగునీరు, హైదరాబాద్‌కు 30 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు లభించేదని వివరించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మాత్రం ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండానే కూలిపోయిందని విమర్శించారు. వందల ఏండ్ల క్రితం కట్టిన నిజాంసాగర్, పోచారంలాంటి ప్రాజెక్టులు నిలబడినప్పుడు, భారీ వ్యయంతో కట్టిన కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు.
తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకెళ్లారు?
ఘోష్ కమిషన్ నివేదికను చెత్త నివేదిక అనడం పదేండ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తగదని భట్టి విక్రమార్క అన్నారు. “ఎలాంటి తప్పు చేయకపోతే బీఆర్ఎస్ నాయకులు ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుకు ఎందుకు వెళ్లారు?’’ అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఘోష్ నివేదికను సభ దృష్టికి తెచ్చామని స్పష్టం చేశారు. ‘‘ప్రాణహిత చేవెళ్ల కోసం రూ.11,680 కోట్లు ఖర్చుపెట్టారు. 38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టులో 11,680 కోట్లు పోగా మిగిలిన 27,500 కోట్లు ఖర్చు పెడితే 16. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది” అని అన్నారు. కానీ, అంచనాలను లక్ష కోట్లకు పెంచి, 152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్టును వదిలేసి, 100 మీటర్లకు ఎత్తు తగ్గించి మేడిగడ్డను నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లే ఎక్కువ అని, రూ. 12వేల కోట్లు విద్యుత్ బిల్లులు అయ్యాయని, ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని తెలిపారు.
కేబినెట్ అనుమతి లేదు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఇది కేవలం మామ, అల్లుడు (కేసీఆర్, హరీశ్‌రావు) నిర్ణయమేనని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరంపై గత ప్రభుత్వంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మేడిగడ్డపై రిటైర్డ్ ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ పబ్లిక్ నోటీసు ఇస్తే, బీఆర్ఎస్ సభ్యులు కోర్టుకు వెళ్లారని, తాము రిపోర్ట్‌ను చూసి తలెత్తుకోలేమని భయపడ్డారని అన్నారు. గత పదేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే, బనకచర్లలాంటి సమస్యలు చర్చకు వచ్చేవే కాదని తెలిపారు. ‘‘ఘోష్ కమిషన్ నివేదిక చెత్తబుట్ట అంటున్నారు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ వేశారో తెలుసు. ఇప్పుడిక ఎక్కడ వేస్తారో?” అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సభకు వస్తే బాగుండు..
పదేండ్లు తమకు మైక్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ సభ్యులం సభను వదలిపెట్టకుండా పోరాటం చేశామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేసిన నాటి సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెబితే హుందాగా ఉండేదన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు చర్చకు వచ్చినా తప్పుడు కాగితాలు సృష్టిస్తారని, అవాస్తవాలు మాట్లాడుతారని ఆరోపించారు. హరీశ్ రావు నిటారుగా నిలబడలేక కాళేశ్వరంలా కుంగిపోతున్నాడని చురకలంటించారు.