మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • బోనకల్ లో ఇందిర మహిళా డెయిరీ ప్రహరీ, గ్రౌండ్ లెవెలింగ్ పనులకు భూమి పూజ
  • మధిర పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల

మధిర, వెలుగు:  మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్ లో  రూ.1. 75 కోట్లతో నిర్మించనున్న ఇందిర మహిళా డెయిరీ ప్రహరీ, గ్రౌండ్ లెవెలింగ్ పనులకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన శనివారం భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా డెయిరీని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందుతుందన్నారు. 

చేప పిల్లలను విడుదల 

నిర్దేశిత లక్ష్యం ప్రకారం నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు. కలెక్టర్ అనుదీప్ తో కలిసి మధిర పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. మధిర నియోజకవర్గ పరిధిలో ఉన్న నీటి వనరులలో 77 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు భట్టి తెలిపారు. ప్రతి నీటి వనరుల దగ్గర ఎన్ని చేప పిల్లలు విడుదల చేస్తున్నామో వివరాలు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

 వైరాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వైరా : తెలంగాణను రోల్ మోడల్​గా  తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో సామాజిక మార్పు, సమాజ అభివృద్ధి జరుగుతుంని, ఈ క్రమంలోనే వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం వైరా నియోజకవర్గానికి ఒక్క రోజులోనే రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిందని, ఈ అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. 

ఇప్పటికే 100 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశామని  చెప్పారు.  గిరిజన రైతులకు సాగునీటి కోసం 5 వేల బోర్లను వేయించి, కరెంటు సరఫరా చేస్తామని, అలాగే సోలార్ యూనిట్లను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ  వైరా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం గత రెండేండ్లలో  రూ.500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, సీతారామ కాలువల నుంచి వైరా ప్రాజెక్టుకు నీరు తరలించేందుకు రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించామని తెలిపారు. 

కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉంతగానో ఉపయోగపడుతుందని, నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన, నాణ్యతా ప్రమాణాలతో రాజీ లేకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.