
- సర్టిఫికెట్ అందజేసిన సంస్థ ప్రతినిధులు
- గాంధీ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ: పవన్‌కల్యాణ్
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేపట్టిన గ్రామ సభల నిర్వహణ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆగస్టు 23న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఈ భారీ కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తింపు పొందింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ సోమవారం పవన్ కల్యాణ్ ను ఆయన నివాసంలో కలిసి సర్టిఫికెట్, మెడల్ అందించారు.
అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం కళకళలాడుతుందని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది” అని అన్నారు. గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలు రాయిని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.