
- కృష్ణా పెరల్స్‌లోని ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చినట్టు గుర్తింపు
- నేడో, రేపో పూర్తి నివేదిక అందించే అవకాశం
- వర్కర్ల స్టేట్‌మెంట్లు రికార్డ్ చేస్తున్న రాష్ట్ర ఫైర్ ఆఫీసర్లు
- 40 నిమిషాల ఆలస్యం వల్లే ప్రాణ నష్టం జరిగినట్టు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణా పెరల్స్‌లోని ఇన్వర్టర్ బ్యాటరీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్టుగా తేలింది. ఇన్వర్టర్ లో మొదలైన మంటలు షాపు షెట్టర్ పై భాగంలోని ఎల్‌ఈడీ డిస్ప్లే బోర్డులోకి వ్యాపించాయని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. షాపు నిర్వాహకులు ఎప్పటిలాగే ఆరోజు రాత్రి కూడా బిల్డింగ్‌లో పవర్ సప్లయ్ ఆఫ్ చేశారని.. కానీ ఇన్వర్టర్ కు వెళ్లే పవర్ సప్లయ్ మాత్రం యథావిధిగానే ఉందని తేల్చారు. ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కృష్ణా పెరల్స్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆధారాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఘటనపై ఫైర్ సర్వీసెస్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
ఫైర్ ఫోరెన్సిక్ బృందం పరిశీలన
నాగపూర్ ఫైర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చెందిన ఇంజినీర్ నిలీశ్ అఖండే, హైదరాబాద్‌కు చెందిన ఫైర్ ఇంజనీర్, సీరియన్ కన్సల్టెంట్ మహిపాల్ రెడ్డితో కూడిన ప్రత్యేక బృందం బుధవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. అగ్నిప్రమాదం సంభవించిన గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆధారాలు సేకరించింది. ముందుగా కృష్ణా పెరల్స్‌లోని ఇన్వర్టర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా గుర్తించింది. ఈ మేరకు పూర్తి నివేదికను ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు అందించేందుకు సిద్ధమవుతున్నది. దీంతో పాటు అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగిందనే వివరాలతో రాష్ట్ర ఫైర్ డిపార్ట్‌మెంట్ కూడా సమగ్ర దర్యాప్తు చేస్తోంది. కృష్ణా, మోదీ పెరల్స్‌లో పనిచేస్తున్న వర్కర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వర్కర్ల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
ప్రత్యక్ష సాక్షి, వర్కర్ చెప్పిన వివరాలు ఇలా..
ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను ప్రత్యక్ష సాక్షి అయిన షాపు వర్కర్ నుంచి ఫైర్ సర్వీసెస్ అధికారులు సేకరించారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లు గంట సేపు మంటలను అదుపు చేసేందుకు యత్నించినట్లు.. చివరకు మంటలు కంట్రోల్ కాని స్థితికి చేరిన తర్వాతే ఫైర్ సర్వీసెస్ కు కాల్ చేసినట్లు గుర్తించారు. మంటల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే ఫైర్ కాల్ చేసి ఉంటే.. ప్రాణ నష్టం తప్పేదని నిర్ధారణకు వచ్చారు.
అగ్నిమాపక శాఖకు చెందిన ఓ అధికారి ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు. శనివారం రాత్రి ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుని కుటుంబ సభ్యులు 19 మంది, నలుగురు వర్కర్లు సహా మొత్తం బిల్డింగ్‌లో 23 మంది నిద్రిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫోర్ షాప్ షెట్టర్ పై భాగంలో గల ఎల్‌ఈడీ డిస్ప్లే బోర్డులో మంటలు వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ వర్కర్ ఇది గమనించాడు. ప్రహ్లాద్ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు.
మంటలు ఆర్పే యత్నంలో కాల్ ఆలస్యం..
అగ్నిప్రమాదం జరిగిన విషయం వర్కర్ చెప్పిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న చిన్న పిల్లలు మినహా కొంత మంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. షాప్‌లో ఫ్లైవుడ్ సీలింగ్ ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగ కమ్ముకుపోయింది. బక్కెట్లతో నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఇలా సుమారు 40 నుంచి 50 నిమిషాలు శ్రమించారు. ఈ క్రమంలోనే ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లే దారిలో ఉన్న మూడు బైకులకు మంటలు అంటుకున్నాయి.
దీంతో ఉదయం 6.15 గంటల సమయంలో ఇద్దరు మహిళలు హాహాకారాలు చేస్తూ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చారు. అగ్ని ప్రమాదం సంభవించిన గ్రౌండ్ ఫ్లోర్ షాపు పక్కనే ఉన్న టన్నెల్ లాంటి దారిలో పూర్తిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. బిల్డింగ్ లోపలి వైపు ఉన్న వాళ్లు బయటకు రాలేకపోయారని దర్యాప్తులో తేలింది.
ఫస్ట్ ఫ్లోర్ హాల్‌లోనే 17 మంది ప్రాణాలు
మంటల తీవ్రత పెరిగిపోవడంతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ప్రహ్లాద్ సహా 17 మంది అక్కడి కిచెన్ పక్కనే ఉన్న హాల్‌లోకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోపలి నుంచి బోల్ట్ పెట్టుకున్నారు. అద్దాల ఫ్రేమ్‌తో ఉన్న కిటీకీలు మూసేశారు. అదే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వర్కర్‌తోపాటు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న మరో ముగ్గురు వర్కర్లు మెట్లపై నుంచి టెర్రస్ మీదుగా బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. మంటల నుంచి ప్రాణాలు కాపాడుకుని బయటకు వచ్చిన ఇద్దరు మహిళలు ఇచ్చిన సమాచారంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.
అక్కడే ఉన్న హమీద్ అలీ అనే వ్యక్తి ఉదయం 6.16 గంటలకు ఫైర్ సర్వీసెస్‌కు కాల్ చేసి సమాచారం అందించాడు. దీంతో మొఘల్‌పుర ఫైర్ ఇంజిన్ 6.17కు బయలుదేరి నాలుగు నిమిషాల వ్యవధిలో 6.21 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ సర్వీసెస్‌కు కాల్ రావడం అప్పటికే దాదాపు గంటసేపు ఆలస్యం అయ్యింది. చివరకు ఫైర్ ఇంజన్లు వచ్చే సరికే హాల్‌లో ఉన్న వారిలో మహిళలు సహా మొత్తం ఎనిమిది మంది పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు నిర్ధారించారు.