- హస్తం గూటికి హైదరాబాద్ డిప్యూటీ మేయర్?
- సీఎంను కలిసిన శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు
- కొంత కాలంగా బీఆర్ఎస్ కు దూరం
- కేటీఆర్ నిర్వహించిన కార్పొరేటర్ల మీటింగ్ కూ దూరం
- మొన్న హస్తం గూటికి బాబా ఫసియొద్దీన్
- నిన్న రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు భేటీ
- రోజురోజుకూ మారుతున్న పరిణామాలు
హైదరాబాద్: నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం వాళ్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మీటింగ్ కు శ్రీలత గైర్హాజరయ్యారు.
శ్రీలత భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీలత మల్కాజ్ గిరి, లేదా సికింద్రాబాద్ సీటును ఆశించారు. సిట్టింగులకే టికెట్లు కేటాయిస్తున్నట్టు అప్పుడు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసినప్పుడు తనకు మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వాలని అడిగగా లభించలేదు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఓటమి తర్వాత జరిగిన కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. కేసీఆర్ ను కలిసేందుకు నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లిన శ్రీలత దంపతులకు అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో ఆ రోజే కాంగ్రెస్ లో చేరతామని ప్రకటించారు.
ఇదిలా ఉండా మూడు రోజుల క్రితం మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ తర్వాత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచలనం రేకెత్తించాయి. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు శ్రీలత్ శోభన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇంకా ఎవరెవరు కారు దిగుతారన్నది సిటీలో హాట్ టాపిక్ గా మారింది.
