డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

గోదావరి నది నుంచి నీళ్లను ఎత్తిపోయ్యకుండ మెడిగడ్డ కూలిపోతుందంటూ గత ప్రభుత్వాన్ని బదున్నామ్ చెయ్యాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. మేము కూడా మెడిగడ్డ పోతాం.. నిజాలు నిగ్గుతేల్చుతం.. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

నల్లగొండలో మీటింగ్ పెడితే.. కేసీఆర్ ని తిరగనివ్వం అంటున్నరు..  తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తిరగనివ్వరా.. సంపుతారా ఎం చేస్తారు..?,  కేసీఆర్ తో పెట్టుకునే దమ్ము ఉన్నదా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు.. మరోకరు గెలువొచ్చు.. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.. మళ్లీ మేం డబుల్ స్పీడ్ లో అధికారంలోకి వస్తాం.. అప్పుడు మేం కూడా ఇట్లనే మాట్లాడాల్నా అని మండిపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి నదులపై అవగాహన లేదని .. మమ్మల్నీ అడిగితే చెప్పమా.. ఆగమాగమై ప్రాజెక్టులను అప్పగించి వచ్చారని విమర్శించారాయన.

కృష్ణ నదిలో న్యాయమైన వాటా తేలే వరకు.. ఎప్పటికిప్పుడు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే.. తల తెగినా సరే పెట్టనని తేల్చి చెప్పానన్నారు. తెలంగాణ రైతులు చెట్టుకొకడు.. పుట్టకొకడు అయ్యారని.. కొంత కుదురుకోనని కేంద్రం రూ.25వేల కోట్లు ఆపినా.. మోటార్లు పెట్టలేదన్నారు. మళ్లా మన ప్రభుత్వమే వస్తుంది.. మంచిగా చేసుకుందాం.. అప్పటి వరకు హక్కుల కోసం పోరాడుదామన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తాయని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షంలోకి వచ్చాను కదా.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఆగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చెయ్యగానే ఐపోలే.. అన్ని పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి నీళ్ల వాటా వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని.. అప్పటివరకు మీ వెంటా పడుతూనే ఉంటామని కేసీఆర్ హెచ్చరించారు.