వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో వర్షాకాలనీకి ముందే నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలని, పెరిగిన జనాభా, వాహనాలతో ఇరుకుగా మారిన రోడ్లను విస్తరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జీడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్ చాహత్ బాజ్‍పాయ్‍తో కలిసి ఆర్‍ఈసీ వద్ద చేపట్టిన డ్రైనేజీ పనులు, నయీంనగర్ రాజాజీ నగర్ నాలా చేపట్టిన పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుంచి బుద్ధభవన్ మీదుగా గోపాల్‍రావు బిల్డింగ్ వద్ద కేయూ మెయిన్ రోడ్డుకు కలిసే మార్గాలను పరిశీలించారు.
హనుమకొండ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు కాంగ్రెస్ భవన్, బుద్ధభవన్ మీదుగా కేయూ రోడ్డుకు ఈజీగా చేరుకునేందుకు అవసరమైన పనులు, ప్రతిపాదనలపై అధికారులు, స్థానికులతో చర్చించారు. నగరంలో మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. నగరాభివృద్ధి కోసం స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.
