
- ఎమ్మెల్యే అయ్యాక వరుస ప్రమాదాలతో భయాందోళనకు గురైన లాస్య నందిత
- సన్నిహితుల సలహాతో దర్గాకు వెళ్లి ప్రార్థనలు
- తిరిగి వస్తుండగా దుర్మరణం
కంటోన్మెంట్, వెలుగు: ఎమ్మెల్యే అయ్యాక వరుసగా ప్రమాదాలు చోటుచేసుంటుండగా భయాందోళనకు గురై.. సన్నిహితుల సలహాతో తనకు మంచి జరగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భావించారు. దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేసినా చివరకు మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యేగా లాస్యనందిత గెలిచిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు.
ఆ తర్వాత గత డిసెంబరులో బోయిన్‌పల్లిలోని ఓ ఆస్పత్రి ఓపెనింగ్ కు వెళ్లి లిఫ్ట్‌లో మూడున్నర గంటల పాటు ఇరుక్కుపోయారు. ఈనెల13న నల్గొండలో బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. దీంతో తనకు ఏదో జరుగుతుందని అనుమానించడమే కాకుండా భయాందోళనలో పడ్డారు. దీంతో సన్నిహితుల సలహా మేరకు ఎక్కడైనా ఓ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేయించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో తను క్షేమంగా ఉండేందుకు సదాశివపేటలోని మిస్కిన్ బాబా దర్గాకు వెళ్లి తాయత్తులు కట్టించుకున్నట్లు తెలిసింది.
ఆమె ఒంటిపై 12 తాయత్తులు..?
లాస్య నందిత డెడ్ బాడీకి శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఆమె ఒంటిపై 12 తాయత్తులు ఉన్నట్లు గుర్తించి వాటిని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుస ప్రమాదాలు చోటు చేసుకోగా.. సన్నిహితుల సలహా మేరకు పలు ఆలయాలు, దర్గాల వద్దకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేయించుకుని తాయత్తులు కట్టించుకున్నట్లు.. అయినా ప్రాణాలు దక్కలేదని స్థానికులు పలువురు చెబుతున్నారు.