పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం
  • పనిచేయని రెండు పంపులు
  • మొరాయిస్తున్న నాలుగో పంప్
  • జొన్నలబొగడ పంప్​హౌస్​లో 
  • మూలకు పడ్డ రెండో పంప్​ 

నాగర్​కర్నూల్, వెలుగు :రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను కడుతూనే ఉన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద లక్ష 35వేల ఎకరాలకు సాగునీరందించే ర్యాలంపాడు రిజర్వాయర్​కు బుంగ పడి 8 నెలలు కావస్తున్నా ఇంకా సర్వేలతోనే కాలం గడుపుతున్నారు. మూడు జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం గురించి పట్టించుకోవడం లేదు. 2020 అక్టోబర్ మూడో వారంలో కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్ ఎల్లూరు పంప్ హౌస్​లో ప్రమాదం జరిగి ఐదు పంపులు నీటమునిగాయి. ఈ ఘటనలో మూడో పంప్​బేస్​తో సహా పైకి లేవగా ఐదో పంప్​లో షట్టర్ ​ప్రాబ్లం బయటపడింది. పంప్​హౌస్​లో 55 మీటర్ల వరకు చేరిన నీటిని తోడిపోయడానికి దాదాపు నెల పట్టింది. బేస్ నుంచి వచ్చిన మూడో పంపును విడదీశారు. ఈ ప్రమాదంలో సర్జ్​పూల్, పంప్​హౌస్​ మధ్య ఉన్న 50 మీటర్ల రాక్​లెడ్జర్ ​బీటలు వారింది. నీటి ప్రవాహం తగ్గకపోవడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీని కాదని మేఘా కంపెనీకి పనులు అప్పగించారు. కృష్ణా నది నుంచి అప్రోచ్ కెనాల్​లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేసి.. రూ.2 కోట్లు పోసి రాక్​లెడ్జర్​ రిపేర్లు చేసినా నీటి ప్రవాహం ఆగలేదు. దీంతో ఐదో పంపును పక్కన పెట్టారు. గత  ఏడాదితో పాటు ఈసారి కూడా మూడు పంపులతోనే నడిపించారు. తాజాగా నాలుగో పంప్​లో బేరింగుల సమస్యను గుర్తించారు. చివరికి ఎల్లూరు పంప్​హౌస్​  రెండు పంపులతో నడిచే దుస్థితికి చేరింది. ఎల్లూరు పంప్​హౌస్​ ప్రమాదానికి కారణాలు తెలుసుకోకుండా..వాటిల్లిన నష్టం ఎంతో లెక్కించకుండా, రిపేర్లకు ఎంత ఖర్చవుతుందని లెక్కలేయకుండా కథ నడిపిస్తున్నారు.  

జొన్నలబొగడలో సేమ్​సీన్​ 

ఎల్లూరులో ఇట్లుంటే జొన్నలబొగడ పంప్​హౌస్​లో రెండో పంప్ మూలనపడి ఏడాది దాటింది. దానికి కవర్లు కప్పి పెట్టి ఉంచారు. ఎల్లూరు లిఫ్ట్ పంప్​హౌస్​ మోటర్లు, పంపులు బాగు చేయడానికి బీహెచ్ఈఎల్ ప్రతినిధులు నాలుగైదు సార్లు వచ్చి పరిశీలించి వెళ్లారు. అందులోని కొన్ని విడిభాగాలను భోపాల్​కు తరలించారు. ఈ పనులను సబ్​కాంట్రాక్ట్​కు ఇచ్చుకున్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర అవుతున్నా రిపేర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇంజినీరింగ్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకుని ప్లాన్లు తయారు చేసినా ఒరిగిందేమీ లేదు. ఈ ఏడాది యాసంగి సాగుకు కేఎల్ఐ కింద నీళ్లిస్తామని ప్రకటించినా శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ చేసి కాల్వల కింద సాగు చేసిన పంటలు ఎండబెట్టారు.  

జీవితకాలపు ఆన్​గోయింగ్​ ప్రాజెక్టు

జీవితకాలపు ఆన్​గోయింగ్​ప్రాజెక్టుగా ముద్రపడిన కల్వకుర్తి లిఫ్ట్​ పనులు డీపీఆర్​ మేరకు పూర్తి కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించలేదు. ఆన్​గోయింగ్ ​ప్రాజెక్ట్ కనుక పంప్​హౌస్​లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ నెట్​వర్క్ ​మెయింటనెన్స్​ పనులకు నిధులిచ్చే అవకాశాలుండవు. దీంతో కాలువలు కూలి.. మధ్యలో పూడిక చేరి, చెట్లు మొలిచి వాటిని బాగు చేసుకోలేక రైతులు కష్టాలు పడుతున్నారు. నాలుగు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లతో చెరువులు, కుంటలు నింపి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిస్తున్నామని చెప్పుకుంటున్నా కాల్వల మీద వేల సంఖ్యలో పెట్టిన కరెంట్ మోటర్లు.. డిస్ట్రిబ్యూటరీ నెట్​వర్క్​ సిస్టం ఏదని వెక్కిరిస్తున్నాయి. 

ఆగని ఓపెన్ బ్లాస్టింగ్...

ఎల్లూరు పంప్​హౌస్​ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పాలమూరు–రంగారెడ్డి అండర్ టన్నెల్ బ్లాస్టింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 అక్టోబర్ 16న మూడో పంపును ఆన్ చేసిన రెండు మూడు నిమిషాల వ్యవధిలోనే పాలమూరు అండర్ టన్నెల్ బ్లాస్టింగ్ మూలంగా పంప్, మోటార్​కు మధ్య ఉండే సాఫ్ట్ బాల్ విడిపోయింది. దీంతో బేస్ కదిలిపోయి నిమిషాల్లోనే భారీగా నీరు చేరింది. పంపులు ఆన్ చేసినప్పుడు ఉండే పీడనంతో పాటు వెలువడే ఒత్తిడికి బ్లాస్టింగ్ వైబ్రేషన్స్ తోడవడంతో కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కుప్పకూలింది. ఎల్లూరు రిజర్వాయర్​కు 250 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి మొదటి లిఫ్ట్ లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్​కు నీటిని తరలించేందుకు తవ్వుతున్న అప్రోచ్ టన్నెల్ అండర్ గ్రౌండ్  కెనాల్​లో బ్లాస్టింగ్ మూలంగా ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఎంక్వైరీ జరిగితే అన్ని వివరాలు బయటపడతాయని ప్రకటించినా.. అసలు ఏ విచారణ చేయలేదు. పాలమూరు అండర్ టన్నెల్ పనుల్లో ఇప్పటికి కంట్రోల్డ్ బ్లాస్టింగ్ కాకుండా విచ్చలవిడిగా ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. కదిలిన పంప్​హౌస్ ​బేస్​లో పగుళ్లు  ఏమేరకు ఉన్నాయో పరిశీలిస్తూనే ఉన్నారు.