- ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన
- యూడీఏఐ నుంచి రూ.220 కోట్లు మంజూరు
- నాలుగు చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
- వచ్చే వేసవి లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక
మహబూబ్‌నగర్, వెలుగు: తలాపున కృష్ణా నది పారుతున్నా పాలమూరు నగరంలో దశాబ్దాలుగా తాగునీటి సమస్య ఎదురవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వాలు ఈ ప్రాంతంపై చిన్నచూపు చూడగా, తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో తాగునీటి కొరత నివారణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో నగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రాంతాల వారీగా కొత్త నీటి ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపగా, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) కింద ట్యాంకుల నిర్మాణాలకు అనుమతులు లభించాయి. మొత్తం 14 ట్యాంకుల నిర్మాణానికి రూ.22.94 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.16.84 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.6.01 కోట్లు విడుదల చేసింది.
జనాభా ఆధారంగా ట్యాంకుల నిర్మాణం..
ప్రస్తుతం పాలమూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 తాగునీటి ట్యాంకులు ఉన్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మరో 14 ప్రాంతాల్లో కొత్త ట్యాంకులను నిర్మించనున్నారు. ట్యాంకుల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ప్రభుత్వ విప్‌తో పాటు మున్సిపల్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉంది, అక్కడి ప్రజలకు సరిపడా తాగునీరు అందుతోందా, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం అవుతుందనే అంశాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 12వ డివిజన్ పరిధిలోని వీరన్నపేట(డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపంలో) రూ.1.38 కోట్లతో 500 కిలోలీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తున్నారు. 35వ డివిజన్‌లోని వీరన్నపేట వద్ద రూ.1.29 కోట్లతో 1200 కిలోలీటర్ల(ఐదు లక్షల లీటర్లు) సామర్థ్యం గల ట్యాంకు, 25వ డివిజన్ భగీరథ కాలనీలో రూ.3.60 కోట్లతో 1800 కిలోలీటర్ల(18 లక్షల లీటర్లు) సామర్థ్యం గల ట్యాంకు, 31వ డివిజన్ హనుమాన్‌పురలో రూ.4.21 కోట్లతో 2200 కిలోలీటర్ల(22 లక్షల లీటర్లు) సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మిగతా ట్యాంకులను టీచర్ కాలనీ ప్రాంతంలో రెండు, ప్రభుత్వ డైట్ కాలేజీ వద్ద ఒకటి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద, తిరుమల హిల్స్, ఎనుగొండ సాంబశివాలయం, మర్లు ప్రాంతాల్లో నిర్మించేందుకు స్థల పరిశీలన పూర్తి చేశారు. జైనల్లీపూర్ వద్ద ఒక ట్యాంకు నిర్మించేందుకు ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రతి కుటుంబానికి రోజుకు 135 లీటర్ల నీరు..
రాబోయే 15 సంవత్సరాల వరకు నగరంలో తాగునీటి కొరత లేకుండా మూడు లక్షల జనాభాకు సరిపడా నీటి సరఫరా జరిగేలా తాగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ప్రతి కుటుంబానికి రోజుకు 135 లీటర్ల నీరు అందించే లక్ష్యంతో ఈ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని 22 ట్యాంకుల సామర్థ్యం మొత్తం 2.85 కోట్ల లీటర్లు కాగా, కొత్తగా నిర్మించనున్న 14 ట్యాంకుల ద్వారా మరో 1.50 కోట్ల లీటర్ల సామర్థ్యం పెరుగుతుంది. ఈ ట్యాంకులకు నీటిని అందించేందుకు 26 కిలోమీటర్ల మేర ఫీడర్ మెయిన్ పైప్‌లైన్, 210 కిలోమీటర్ల మేర పంపిణీ పైప్‌లైన్ వేయనున్నారు. ఈ పైప్‌లైన్ ద్వారా సుమారు 10 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. వచ్చే వేసవికల్లా ఈ ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
వచ్చే వేసవి నాటికి అందుబాటులోకి..
గరంలో 14 ప్రాంతాల్లో ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంది. నాలుగు చోట్ల స్థలాలు గుర్తించి, భూమి పూజ చేశాం. మిగతా చోట్ల స్థల పరిశీలన పూర్తైంది. ఈ ట్యాంకులో 18 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఉంది. కానీ.. వచ్చే వేసవి నాటికి ట్యాంకు నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతరం తాగునీటిని అందిస్తాం.
- విజయ్ భాస్కర్ రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ట్యాంకుల నిర్మాణం
నగర జనాభా వేగంగా పెరుగుతోంది. తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో నీటి సమస్య తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో శాశ్వత, సమర్థవంతమైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో కొత్తగా 14 తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. నగరంలోని ప్రతి ప్రాంతానికి సమానంగా తాగునీరు అందేలా కృషి చేస్తాం. - యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పాలమూరు
