స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలేవి?: నిజాం కాలం నుంచి నేటివరకు ఇదే పరిస్థితి..

స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలేవి?: నిజాం కాలం నుంచి నేటివరకు ఇదే పరిస్థితి..

నాటి  నైజాం ప్రభుత్వం నుంచి నేటివరకు తెలంగాణవాసులు ( స్థానికులకు ) అవకాశాలు లేక స్వరాష్ట్రం వదిలి పరాయి రాష్ట్రం,  పరాయి దేశంలో  బతుకు బండిని ఈడుస్తున్నారు.  ముంబై, దుబాయ్ తరలిపోయి వలస బతుకులు బతుకుతున్నారు.  గత 50 సంవత్సరాల నుంచి  తెలంగాణలో అక్షరాస్యత పెరిగి తమ తమ పిల్లలకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు నేటికీ నెరవేరటం లేదు. నాటి ముల్కి నిబంధన ఆరు సూత్రాల పథకం నుంచి 610 జీవో నుంచి 14 F  పేరిట  స్థానికేతరులకే ఉద్యోగాలు దక్కాయి.  కొట్లాడి సాధించిన తెలంగాణలో నేటికీ ఉద్యోగాలు స్థానికులకు కరువైనాయి.  

భౌగోళిక తెలంగాణ సాధ్యమైనా ఆర్థిక, సామాజిక తెలంగాణ ఏర్పాటు కావలసి ఉంది.  ప్రపంచ దేశాలు అన్నింటికన్నా తెలంగాణ డక్కన్ హైదరాబాద్  ప్రాంతానికి ఎన్నో వనరులు ఉన్నాయి.  సానుకూల వాతావరణం నీటి సౌలభ్యత,  పారిశ్రామిక రంగానికి చెందిన వనరులు ఉన్నాయి.  సకల సంపదలు ఉన్న తెలంగాణలో స్థానికులకు అవకాశాలు  కరువైనాయి.  

పదవీ విరమణ ఉద్యోగులనే కొనసాగిస్తారా?

యువకులంతా ఉద్యోగుల వేటలో అనేకరకాల కోచింగ్​లు తీసుకొని కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు.  గుడ్డిలో  మెల్లగా ప్రజాపాలన ప్రభుత్వం సుమారు 59 వేల పై చిలుకు ఉద్యోగాలు  వివిధ హోదాల్లో నియమించింది. ఇప్పటికీ మనం గమనిస్తే కిందిస్థాయి నుంచి పై వరకు అందరూ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులే  విధులు నిర్వహిస్తున్నారు.  ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్,  ఆర్ అండ్ బి  ఇతర శాఖలలో ఉన్నత అధికారులుగా పనిచేసినవారు తిరిగి ఔట్​సోర్స్​ కింద మళ్లీ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.  

వారు ఉద్యోగ విరమణ చేసిన వెంటనే కొత్త ఉద్యోగం పొందుతున్నారు.  ఉద్యోగ విరమణ తర్వాత పది పదిహేను సంవత్సరాలపాటు వారు అదే స్థాయిలో ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు.  తాజాగా   రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శాంతకుమారిని  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నిర్వహణకు ఇన్​చార్జ్​గా నియమించారు.  గత ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగస్తులకు 58 ఏండ్ల వయోపరిమితి నుంచి 61 ఏండ్లకు వయోపరిమితి పెంచి, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసింది.  

అడియాసలు

ప్రస్తుత 33 జిల్లాల్లో మండలాలవారీగా చూస్తే  ప్రతి దగ్గర డిప్యూటేషన్ల మీదనే ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అవకాశాలు లేక తెలంగాణ యువత, ఉద్యోగులు అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.  సొంతరాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వ ఉద్యోగంరానివారు స్వయం ఉపాధి పథకాల ద్వారా బతుకుదెరువు బండి లాగుతారని ఆశించినా  ఆ స్థాయిలో జరగడం లేదు.

ఒక పోస్టుకు వందమంది పోటీ

నోటిఫికేషన్లన్నీ పేపర్ లీకేజ్​లతో  ఆగిపోవడం,  సంవత్సరాలుగా  కోచింగ్ సెంటర్లో  ఉపవాసాలు ఉండి చదివిన చదువులు పనికిరాకుండా పోవడం,  యువకుల వయసు అర్హతను మించిపోవడంతో యువతరం ఆశలన్నీ నిరాశలవుతున్నాయి.  ఒక్క నోటిఫికేషన్ ఇస్తే ఒక పోస్టుకు వందమంది పోటీపడే దుస్థితి నెలకొంది.  మరోవైపు  ఒక్కొక్కరు నాలుగు ఐదు ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు.  

బడుగు బలహీన వర్గాలకు వ్యాపారాలు చేసుకోవడానికి సరైన వసతులు కల్పించడం లేదు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి మెదక్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతవాసులు ముంబై, దుబాయ్ బతుకులకు ఇంకా ఫుల్​స్టాప్ పడటం లేదు.  కొత్తగా వచ్చిన ప్రభుత్వం యువతకు జాబ్ క్యాలెండర్ తెచ్చినా,  నిర్దిష్టమైన తారీఖులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పదేండ్లలో  మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది.  గత పాలకుడి సొంత నిర్ణయాలతో పనులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.  నీటికోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిరోజు వివాదాలతో చర్చల్లో కొనసాగుతోంది.  ఒక్క పనికూడా సరిగ్గా జరగకపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

సామాజిక తెలంగాణ కోసం యువత పోరాడాలి

సకల సంపదలు ఉన్న తెలంగాణలో స్థానికులకు అవకాశాలు కరువవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిలో  తెలంగాణ ప్రాంతవాసులు లేకపోవడం బాధాకరం. ఇదే భవన నిర్మాణ పనులు చేయడానికి ఉత్తర  తెలంగాణ జిల్లావాసులతోపాటు పాలమూరు వాసులు ముంబై, దుబాయ్​కు వెళ్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న స్కిల్ డెవలప్​మెంట్ యూనివర్సిటీ ఎప్పటికి కార్యాచరణ తీసుకుంటుందో  తెలియదు. 

వలసవాసుల సమస్యల పరిష్కారానికి ప్రతి ప్రభుత్వం కమిటీని వేస్తోంది. కానీ,  ఆ కమిటీ నిర్వహించిన కార్యక్రమాలు, చేసిన పనులు బహిర్గతం చేయడం లేదు. లక్షల మంది విద్యావంతులు  ఆందోళనకు గురవుతున్నారు.  ప్రభుత్వం తక్షణమే యువతరాన్ని ఆదుకునే

విధంగా కార్యాచరణ తీసుకోవాల్సి ఉంది. 

నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం 10 ఏండ్లపాటు రకరకాల అంతర్జాతీయ వేదికల్లో కొత్తకొత్త సంస్థలను పెట్టుబడులతో తీసుకొచ్చామని చెప్పారు.  వారు తీసుకువచ్చిన గూగుల్,  అమెజాన్, ఇతర సంస్థల్లో  తెలంగాణ స్థానికులు ఉద్యోగుల శాతం ఎంత?   ఏస్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు?  ఐటీ సంస్థల్లో తెలంగాణ  ప్రాంత ఉద్యోగుల సంఖ్య ఎంతనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. 

సంస్థలు, పెట్టుబడులు  తెచ్చామని  గొప్పలు చెప్పుకోవడం తప్ప మన వాటా ఎక్కడుందో చెప్పటం లేదు.  నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో  నడుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్,  సింగపూర్,  చైనా ఇలాంటి దేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తున్నామని వారికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది.  ఇది మనందరం ఆహ్వానించదగ్గ అంశం. అయితే,  ఇక్కడ ఉద్యోగాల్లో స్థానికుల వాటా శాతం ఎంత? అనేది ప్రశ్నగా మిగులుతోంది.

అస శ్రీరాములు, 
సీనియర్ జర్నలిస్ట్