
- స్తంభించిన జనజీవనం
- ఉమ్మడి నల్గొండలో బీసీ జేఏసీ, ఆయా రాజకీయ పార్టీల నాయకుల నిరసన
- ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: బీసీలకు స్థానిక సంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ నల్గొండ, సూర్యాపేట జిల్లాలో విజయవంతమైంది. ఈ క్రమంలో బీసీ సంఘాలన్నీ ఏకమై నిరసనలో పాల్గొన్నాయి. అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి.
దీంతో జిల్లాకేంద్రంతో పాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి ప్రాంతాల్లో బంద్ సంపూర్ణమైంది. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపించింది. అఖిలపక్ష పార్టీలు, సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపట్టారు. విద్యాసంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వర్తక వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసి వేయించారు. దీంతో జిల్లాలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు..!
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని పార్టీల నాయకులు సూర్యాపేట, నల్గొండ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. దీంతో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. ఈనెల 20వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేశారు.మిర్యాలగూడ లోని హెచ్‌డీ ఎఫ్ సీ బ్యాంక్ లోకి కొంతమంది బీసీ నాయకులు చొరబడి సిబ్బంది పై దాడికి దిగారు. కస్టమర్ సర్వీస్ లేవని బ్యాంకింగ్ పనులను మాత్రమే చేస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా బ్యాంక్ సిబ్బంది పై దాడికి పాల్పడ్డారు.
కార్ల షోరూం అద్దాలను పగలగొట్టిన ఆందోళనకారులు.
బంద్ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని చర్లపల్లిలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ శివారులోని పవన్ మోటార్స్ నెక్సా కార్ల షోరూం అద్దాలను ఆందోళనకారులు రాళ్లు విసిరి పగలగొట్టారు. దీంతో నిర్వాహకులు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరిలో..
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో బీసీ బంద్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. న్యాయబద్ధంగా అందే రిజర్వేషన్ ఫలాలు, బీజేపీ కారణంగా అందకుండా పోతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకూ డిపోలకే పరితమయ్యాయి. అనంతరం కొన్ని బస్సులు నడిచాయి. ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించడంతో ఆయా పార్టీల లీడర్లు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.