
ఈ సారి దీపావళికి టపాకాయలతోపాటు.. నోరూరించే స్వీట్లు తినడానికిరెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకాలస్యం.. ఈ రుచికరమైన స్వీట్లను ఇంట్లోనే తయారుచేసుకోండి.
కోవా పూరి
కావాల్సినవి : గోధుమ పిండి – ఒక కప్పు, మైదా పిండి – అర కప్పు, బెల్లం లేదా చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు, నూనె – సరిపడా, కోవా కోసం : పాలు – ఒక లీటరు, చక్కెర – ఒకటింబావు కప్పు, యాలకుల పొడి – ఒక టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా పిండి, బెల్లం లేదా చక్కెర వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి దోశపిండిలా బాగా కలిపి మూతపెట్టి పక్కన పెట్టాలి. మరోపాన్లో చక్కెర వేసి, నీళ్లు పోసి కరిగించాలి. కాస్త జిగురుగా కాగానే యాలకుల పొడి వేసి కలపాలి. పాన్లో పాలు పోసి అవి సగం అయ్యేవరకు కాగబెట్టాలి. అందులో పావు కప్పు చక్కెర వేసి కలిపి పాలు ఇంకాస్త మరిగించాలి. తర్వాత నిమ్మరసం, యాలకుల పొడి వేసి కలపాలి. కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి రెడీ చేసుకున్న పూరీ పిండిని పోయాలి. అది కాస్త వేగాక పైకి తేలుతుంది. దాంతో రెండు వైపులా వేగించాలి. అలా చేసుకున్న వాటిని పాకంలో ముంచి తీసి, మధ్యలో కోవాను స్టఫింగ్ చేసి మడతపెట్టాలి.
చంద్రవంకలు
కావాల్సినవి : గోధుమపిండి, బెల్లం – ఒక్కో కప్పు, ఉప్పు, నీళ్లు – సరిపడా, బేకింగ్ సోడా – పావు టీస్పూన్, వేడి నూనె – మూడు టీస్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నూనె వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. మూతపెట్టి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్లో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాక వడకట్టాలి. మళ్లీ పాన్లో పోసి కాస్త జిగురుగా అయ్యేవరకు పాకం పట్టాలి. పిండి ముద్దను మరోసారి కలిపి, చపాతీల్లా వత్తాలి. కానీ కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా మూత తీసుకుని చంద్రవంక ఆకారంలో కట్ చేసుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో ఈ చంద్రవంకల్ని వేసి వేగించాలి. ఆ తర్వాత పాకంలో వేసి మూతపెట్టాలి. పాకం కాస్త వేడిగా ఉంటే బాగా పడుతుంది.
ధారాక్షి
కావాల్సినవి : పొట్టు పెసరపప్పు – ముప్పావు కప్పు, మినప్పప్పు – పావు కప్పు, చక్కెర – రెండు కప్పులు, నీళ్లు, నూనె – సరిపడా, నిమ్మరసం, యాలకుల పొడి – ఒక్కో టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో పొట్టు పెసరపప్పు, మినప్పప్పు వేసి బాగా కడిగి, నీళ్లు పోసి ఐదు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్లో చక్కెర వేసి నీళ్లు పోసి కరిగించాలి. కాస్త జిగురుగా రాగానే, నిమ్మరసం, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక రంధ్రం పెట్టిన బాటిల్లో పిండి మిశ్రమాన్ని వేయాలి. అవన్నీ వేగాక తీసి వేడి పాకంలో వేసి తీయాలి.