కాలం వేగంగా గడిచిపోతుంటుంది. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగినట్లు అనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగి దాదాపు ఐదేండ్లు గడిచిపోయాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. 2026 పశ్చిమ బెంగాల్ స్టేట్ ఎన్నికలు హోరాహోరీగా చాలా పెద్ద పోరాటాన్ని తలపించే విగా ఉంటాయి.
గొప్ప ఫ్రెంచ్ రచయిత జీన్ అల్ఫోన్స్ కర్ ఇలా అన్నారు.. ‘ కొన్ని విషయాలు ఎంతగా మారినా మరికొన్ని విషయాలు అంతకంటే ఎక్కువగా యథాతథంగా అలాగే ఉంటాయి’. ఇది వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు పూర్తిగా వర్తిస్తుంది. 2000 నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి, అదే కాంగ్రెస్ నాయకులు, అదే కమ్యూనిస్ట్ నాయకులు బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
తృ ణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977 నుంచి ఏకధాటిగా పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ అనూహ్యంగా ఓడించారు. ఇది ఒక సూపర్ హ్యూమన్ టాస్క్. తృణ మూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా వెస్ట్ బెంగాల్‌లో పూర్తిగా నాశనం చేసింది.
2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలవకుండా మమతా బెనర్జీ అడ్డుకోగలిగారు. ఆమెకు ఎదురు నిలిచిన రాజకీయ శత్రువులు మొత్తం కనుమరుగై పోయారని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. ఇప్పుడు బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
వలసల రాజకీయం
బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో వలసవచ్చినవారిలో హిందూ వలసదారులు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం మైనారిటీలు మాదిరిగానే, హిందూ శరణార్థులు కూడా పెద్ద ఓటుబ్యాంకుగా ఉన్నారు. వలసదారులు ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, మోదీ సారథ్యంలోని బీజేపీ మధ్య ఊగిసలాడుతున్నారు. బెంగాలీ హిందువులు ముస్లిం- మెజారిటీ దేశం బంగ్లాదేశ్‌నుంచి అభద్రతా భావంతో పశ్చిమ బెంగాల్‌కు వలసవచ్చారు. కానీ విచిత్రంగా ఇప్పుడు అదే బంగ్లాదేశ్ ముస్లింలు కూడా వారి దేశం నుంచి వెస్ట్ బెంగాల్‌కు వలసవచ్చారు. బంగ్లాదేశ్ హిందువులు, బంగ్లాదేశ్ ముస్లింలు బెంగాల్‌లో ఒకరినొకరు ఎదుర్కొంటున్నారు.
బెంగాల్‌లో ఎన్నికల కమిషన్, సర్ వివాదం
గత 20 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా చొరబడిన ముస్లిం వలసదారులు భారీ సంఖ్యలో ఉంటున్నారని, వారు ఎన్నికల ఫలితాలను నియంత్రిస్తున్నారని పెద్ద వివాదం ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు రెండూ అలాంటి ఓటర్లను రాజకీయ లబ్ధి కోసం
ప్రోత్సహించాయి. ఈక్రమంలో ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా తన విజయాల కోసం అలాంటి ఓటర్లపై ఆధారపడి ఉంది. 1947 నుంచి వెస్ట్ బెంగాల్ మతపరమైన రాజకీయాలతో బాగా మారిపోయిందనేది నిజం. కాగా, ఎన్నికల కమిషన్ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ని ఆదేశించింది. ప్రతి ఓటరు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి తను ఎక్కడ జన్మించాడో ధృవీకరించడం దీని ఉద్దేశం. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ కారణంగా పెద్దసంఖ్యలో వలసదారులు తమ ఓటును కోల్పోతే దాని ప్రభావం మమతా బెనర్జీపై పడుతుంది.
‘భద్రలోక్’ నుంచి మధ్యతరగతి వరకు...
శతాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌లో ‘భద్రలోక్’ ఆధిపత్యం చెలాయించింది. సంపన్నులు, విద్యావంతులను భద్రలోక్ అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా లేదా సుభాష్ చంద్రబోస్ అయినా వారందరూ ‘భద్రలోక్’ తరగతికి చెందినవారే. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిపొందిన గొప్ప కమ్యూనిస్ట్ బెంగాలీ రాజకీయ నాయకులు జ్యోతిబసు, ఇంద్రజిత్ గుప్తా కూడా 'భద్రలోక్' నుంచి వచ్చినవారే. అలాగే బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా. కానీ, గత 20 సంవత్సరాలలో మధ్యతరగతి వర్గాలు పెరిగాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘భద్రలోక్’ ప్రభావం తక్కువగా ఉంది.
భారతదేశం అంతటా ఉన్నట్టే.. బెంగాల్‌లో నూ మధ్యతరగతి వర్గం పెరుగుదల మరింత దూకుడు రాజకీయాలను తీసుకువచ్చింది. గతంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై పూర్తిగా బెంగాలీ ఆలోచనా విధానం ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఇప్పుడు బెంగాల్ కూడా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలను అనుసరిస్తుంది. జాతీయవాదంలో అసాధారణ పెరుగుదల ఉంది. బెంగాల్‌లో బీజేపీ పెరగడానికి అదే కారణం. భద్రలోక్ కూడా ఇప్పుడు బీజేపీ, ఇతర పార్టీల మధ్య విభజనకు గురైంది.
వ్యతిరేకతలు, అనుకూలతలు
2011 నుంచి మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు వెస్ట్ బెంగాల్ స్టేట్ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో 29 మంది ఎంపీలని మమతా బెనర్జీ గెలిపించారు. ఈ ట్రెండ్ ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవాలి. మమతకు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఏమిటంటే ఆమెకు ఓటు వేసే 28% ముస్లిం ఓటర్లు. మరోవైపు బీజేపీ వేగంగా పుంజుకున్నప్పటికీ, మిగిలిన 72% ఓట్లలో 40% కమలం పార్టీ సాధించాలి. అది చాలా కష్టం. అయితే, మమతా బెనర్జీపై అపారమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది.
ఇతర రాష్ట్రాలు తమ స్టేట్ కంటే మరింతగా అభివృద్ధి చెందాయని బెంగాల్ ఓటర్లకు తెలుసు. 1947 వరకు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా ఉండేది. 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఉంది. మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు సహాయం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు కనుక ఈ కూటమి కొనసాగవచ్చు. బిహార్‌లో కాంగ్రెస్‌కు ఇటీవల జరిగిన ఘోర పరాజయం మమతా బెనర్జీ కాంగ్రెస్ మధ్య పొత్తుపై ఆశలను కూడా తగ్గించింది.
మోదీ జనాదరణపైనే బీజేపీ ఆశలు!
బెంగాల్‌లో బీజేపీ వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 2021 రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ 296 మంది ఎమ్మెల్యే స్థానాల్లో 77 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది, ఇది బీజేపీకి భారీ లాభం. బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తోంది. బహుశా బీజేపీ 2021 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకునే అవకాశం ఉంది. కానీ 28% ముస్లిం జనాభా ఉన్నందున బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కష్టం. పశ్చిమ బెంగాల్‌లో నరేంద్ర మోదీ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. తమ రాష్ట్రం అక్రమ వలసదారులతో నిండిపోయిందని బెంగాలీ హిందువులు ఆందోళన చెందుతున్నారు.
బెంగాలీలు కూడా తమ సంస్కృతిని మార్చుకోవాలని, పరిశ్రమలను స్వాగతించాలని తెలుసు. బెంగాలీలలో మార్పు నెమ్మదిగా వస్తోంది. కానీ, చారిత్రాత్మకంగా బెంగాల్ కూడా కొత్త ఆలోచనలకు తెరతీసింది. బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఓటు వేయాలా వద్దా అని బెంగాలీలు నిశ్శబ్దంగా అంచనా వేస్తున్నారని చెప్పవచ్చు. అస్సాంలోలాగ బెంగాల్ రాజకీయాలను విదేశీయులు నిశ్శబ్దంగా నియంత్రిస్తున్నారనే ఆందోళన కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌లోనూ మార్పు రావొచ్చు, కానీ.. నెమ్మదిగా!
బెంగాల్‌లో నాలుగు ప్రాథమిక శక్తులు
2021లో బీజేపీతో జరిగిన తీవ్ర పోరాటం తర్వాత మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో నాలుగు ప్రాథమిక రాజకీయ శక్తులు ఉన్నాయి. అవి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టుల లెఫ్ట్ ఫ్రంట్లకు కచ్చితమైన చిన్న ఓటు బ్యాంకులు ఉన్నాయి.
వెస్ట్ బెంగాల్‌లో దాదాపు 28% జనాభా కలిగిన మైనారిటీ ఓటుబ్యాంకు ఉంది. ఒకప్పుడు ఈ మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు అండగా వెన్నుదన్నుగా ఉండేది. కానీ ఇప్పుడు, ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వైపు మారారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓటర్లు ఆమెను బీజేపీని ఓడించగల రాజకీయ శక్తిగా చూస్తున్నారు.
- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్
