మిస్టరీ : కృష్ణుడి ఏకాంత మందిరం నిధివన్‌

మిస్టరీ : కృష్ణుడి ఏకాంత మందిరం నిధివన్‌

కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదని అంటుంటారు కొందరు. ‘‘కన్నయ్య ఇప్పటికీ ప్రతిరోజూ భూమ్మీదకు వస్తాడు. బృందావనంలోని ఒక ఆలయానికి వచ్చి, గోపికలతో కలిసి నృత్యం చేస్తాడు. అందుకే అర్ధరాత్రుళ్లు ఆలయం దగ్గర్లో ఆయన చేసే వేణుగానం, గోపికల కాళ్ల గజ్జెల చప్పుళ్లు వినిపిస్తుంటాయ’’ని చాలామంది చెప్తుంటారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లా బృందావనలో ‘నిధివన్’ అనే ఆలయం ఉంది. కృష్ణుడికి సంబంధించి బృందావనం ఒక పవిత్ర స్థలం. అందుకే అక్కడ కృష్ణుడి ఆలయం కట్టించారు. ఆ ఆలయం ఒక అద్భుతం అని చెప్తుంటారు. కానీ.. అందులో ఒక మిస్టరీ కూడా దాగి ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడు. ఇప్పుడు కూడా రాధాకృష్ణులు ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటారనేది భక్తుల నమ్మకం. అంతేకాదు.. గోపికలతో కలిసి నాట్యం కూడా చేస్తుంటాడు. అక్కడే రాధతో ఏకాంతంగా గడుపుతాడని నమ్ముతారు. 

అందుకే ప్రతిరోజూ సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత ప్రధాన ఆలయం ద్వారాలకు తాళం వేస్తారు. చీకటి పడిందంటే.. పూజారులు కూడా అటువైపు వెళ్లేందుకు భయపడతారు. అంతేకాదు.. రాత్రి ఏడు గంటలు దాటాక జంతువులు, పక్షులు కూడా ఆ ప్రాంగణంలో కనిపించవు. 

కాపలా కూడా..

ఆలయం లోపల రాధాకృష్ణులు ఉన్నంతసేపు ఆలయం చుట్టూ అతని సేనలు కాపలా కాస్తాయి. కాకపోతే.. వాళ్లు అదృశ్యరూపంలో ఉండడం వల్ల ఎవరికీ కనిపించరు. కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగనీయరు. ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఎవరైనా అటువైపు వెళ్తే.. వెళ్లిన వాళ్లు చనిపోవడమో, మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని అక్కడివాళ్లు చెప్తారు. ఒకవేళ ఎవరైనా కావాలని రాత్రిపూట ఆలయంలో ఉండిపోతే వాళ్లకు కళ్లు కనిపించకుండా పోవడం, చెవులు వినిపించకపోవడం లాంటి సమస్యలు వస్తాయట! గతంలో అలా చాలామందికి జరిగిందని కథలు కథలుగా చెప్తుంటారు. 

రంగ్ మహల్ 

ఈ ఆలయంలో ‘రంగ్​మహల్’ అనే మందిరం ఉంది. ఈ మహల్‌ని ప్రతి రోజూ సాయంత్రం చాలా అందంగా అలంకరిస్తారు. అందులో గంధం చెక్కతో చేసిన మంచం వేస్తారు. ఒక గిన్నెలో నీళ్లు, తాంబూలం, వెండి గ్లాసు నిండా పాలు, స్వీట్స్, పళ్లు, చీరలు, కంకణాలు ఉంచుతారు. ఉదయం గుడి తలుపులు తెరిచి చూసేసరికి గిన్నెలో నీళ్లు కొన్ని ఖాళీ అవుతాయి. పండ్లు రుచి చూసిన గుర్తులు ఉంటాయి. అక్కడపెట్టిన వస్తువులన్నీ వాడినట్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అందుకే సాయంత్రం అయ్యిందంటే.. అటువైపు ఎవరూ వెళ్లరు. మనుషులే కాదు కోతులు, పక్షులు కూడా సూర్యాస్తమయం తర్వాత అక్కడినుంచి వెళ్లిపోతాయి. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే వచ్చి వాటిని రుచి చూశాడని భక్తులు నమ్ముతారు. 

వింత చెట్లు

నిధివన్‌ ఆలయ ప్రాంగణంలో కొన్ని చెట్లు వింతగా ఉంటాయి. సాధారణంగా చెట్ల కొమ్మలు పై వైపుకు ఉంటాయి. కానీ ఇక్కడి చెట్లకు కొమ్మలు కింది వైపుకు వేలాడుతుంటాయి. చెట్లు కూడా చాలా పొట్టిగా, ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయి. తులసి మొక్కలు కూడా జంటగా ఉంటాయి. ఆ తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారతాయని కొందరు చెప్తున్నారు. శ్రీకృష్ణుడిని ఆహ్వానించేందుకు ఆ ప్రాంగణంలో ఉన్న చెట్లు ప్రతి రోజు రాత్రి వెలుగులు విరజిమ్ముతాయి. 

అంతేకాదు.. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇక్కడి చెట్ల మీద పక్షుల గూడు ఒక్కటి కూడా ఉండదు. వాటి దగ్గర పురుగులు, కీటకాలు కూడా కనిపించవు. ఆ చెట్లు శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైనవి అని నమ్ముతారు. నిధివన్‌కు దగ్గర్లో ఒక బావి ఉంది. రాధ దాహాన్ని తీర్చడం కోసం కృష్ణుడు స్వయంగా తన వేణువుతో ఆ బావిని నిర్మించాడని చెప్తుంటారు.