ఢిల్లీలో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ.. మూడు రోజులుగా ‘వెరీ పూర్’ కేటగిరీలో ఏక్యూఐ

ఢిల్లీలో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ.. మూడు రోజులుగా ‘వెరీ పూర్’ కేటగిరీలో ఏక్యూఐ

న్యూఢిల్లీ: చలి పెరిగే కొద్దీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం స్థాయి ‘సివియర్‌‌‌‌’ జోన్‌‌కు చేరుకున్నది. మూడు రోజులుగా ఎయిర్‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉంటున్నది. శనివారం ఢిల్లీ వ్యాప్తంగా 304గా ఉన్న ఏక్యూఐ.. ఆదివారం 325కి.. సోమవారం సాయంత్రానికి 347కి చేరుకున్నది. కొన్ని ఏరియాల్లో మాత్రం సివియర్ స్టేజ్‌‌కు పెరిగింది. 

వాజిర్‌‌‌‌పూర్‌‌‌‌లో అత్యధికంగా 416, ముండ్కాలో 414, రోహిణిలో 406 గా నమోదైంది. ఏక్యూఐ 400కి మించి నమోదైతే ‘సివియర్’ కేటగిరీలో ఉన్నట్లు లెక్క. రాత్రిళ్లు గాలుల్లో వేగం తగ్గడం, ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. ఢిల్లీలో గాలి నాణ్యత మరికొన్ని రోజులు ఇలానే  ఉండే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది.

ఈ సారే అత్యధికం

గత రెండేండ్లతో పోలిస్తే ఈ అక్టోబర్‌‌‌‌లోనే ఎయిర్ క్వాలిటీ ఎక్కువగా పడిపోయింది. వర్షాలు తగినంతగా పడకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను కాల్చడం తగ్గిందని, కానీ వాహనాలు పొగ వల్లే కాలుష్యం పెరుగుతున్నదని ఢిల్లీ ఎన్విరాన్‌‌మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ చెప్పారు. 

నేషనల్ క్యాపిటల్ రీజియన్‌‌ (ఎన్‌‌సీఆర్)లో పూర్ క్వాలిటీ డీజిల్‌‌తో నడిచే బస్సులపై నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిక్, సీఎన్‌‌జీ, బీఎస్ 6 డీజిల్ బస్సులను మాత్రమే ఢిల్లీలో, ఎన్‌‌సీఆర్ పరిధిలోని హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సిటీల్లో నడిపేందుకు అనుమతిస్తామని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. 

పటాకులపై గత నెలలోనే నిషేధం

పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో పటాకుల అమ్మకం, తయారీ, నిల్వ, వాడకంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఫైర్ క్రాకర్ల వినియోగాన్ని తగ్గించేందుకు ‘పటాకే నహీ.. దియే జలావ్’ అనే అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 21 పొల్యూషన్ హాట్‌‌ స్పాట్లలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్లాన్ రూపొందించింది. అక్కడ పొల్యూషన్‌‌కు కారణమవుతున్న వాటిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్‌‌ను పంపనుంది.