
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. వారణాసి మానస హీరోయిన్. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేస్తూ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ ‘పెద్ద స్పాన్ వున్న కమర్షియల్ ప్రాజెక్ట్ నాకు రెండో సినిమాగా రావడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరం బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ. గెటప్స్ కూడా వినూత్నంగా వేయించారు. అమ్మచెబితే ఏదైనా చేసే కృష్ణ అనే కుర్రాడు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ దర్శకుడు అర్జున్ అద్భుతంగా తెరకెక్కించారు’ అని చెప్పాడు.
‘ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లే సత్యభామ అనే పాత్రలో నటించాను’ అని చెప్పింది మానస. దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ ‘డివైన్ ఫీల్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ప్రశాంత్ యూనిక్ స్టోరీ లైన్ ఇచ్చారు. ఇలాంటి కథతో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ‘మురారి’ చిత్రంతో భీమ్స్ పోల్చారు కానీ అంతకుమించి ఉంటుందని చెప్పగలను. రసూల్ కెమెరా వర్క్, ఫైట్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అశోక్ టాప్ రేంజ్ హీరోలా నటించాడు’ అని చెప్పాడు. నవంబర్ 14 మరికొన్ని చిత్రాలు వస్తున్నప్పటికీ తమ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత బాలకృష్ణ తెలియజేశారు.