
కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో దసరా ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. గురువారం ( అక్టోబర్ 2 ) దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టులో నిర్వహించిన కర్రల సమరం హింసాత్మకంగా మారింది. ఏటా ఆనవాయితీగా జరిగే బన్నీ ఉత్సవంతో దేవరగట్టు రక్తసిక్తం అయ్యింది.దేవరగట్టులో ఆచారం పేరుతో జరిగే ఈ కర్రల ఉత్సవంలో 11 గ్రామాల మధ్య కర్రల సమరంలో వంద మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
విగ్రహమూర్తుల కోసం జరిగే కర్రల సమరంలో నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట ఒకవర్గంగా.. అరికేర, అరికేరతండా, విరుపాపురం, సులువాయి వర్గంగా భక్తుల మధ్య కర్రల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు మృతి చెందగా.. వంద మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన వారిలో ఒకరు అరికెరకు చెందిన కోసిగి తిమ్మప్పగా, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులని తెలుస్తోంది. కర్రల సమరంలో అగ్గి జీవిటీలు విసురుకోవడంతో ఎక్కువమంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఉత్సవ మూర్తుల విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లడానికి గ్రామస్తులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకోవడం బన్నీ ఉత్సవంలో భాగం.
ఈ క్రమంలో నేక మందికి తలలు పగిలాయి. కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యాయి, అనేకమందికి కాలిన గాయాలతో బయటపడ్డారు.ఈ ఉత్సవాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చారు.