37 నాలాల పనుల్లో ఒక్కటీ పూర్తి కాలే

37 నాలాల పనుల్లో ఒక్కటీ పూర్తి కాలే
  • మే 31తో ముగిసిన ఉన్నతాధికారుల డెడ్​లైన్
  • నెలాఖరుకు ఆరు చోట్ల పూర్తవుతాయంటున్న ఆఫీసర్లు
  • మిగతా పనులపై నో క్లారిటీ
  • ఈసారీ మునక తప్పేలా లేదని జనం ఆందోళన

హైదరాబాద్, వెలుగు:వానా కాలం మొదలయ్యే నాటికి కంప్లీట్​చేసేలా గ్రేటర్​లో స్టార్ట్​చేసిన 37 నాలాల అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి కేటీఆర్, సీఎస్​సోమేశ్​కుమార్ పెట్టిన డెడ్​లైన్(మే31) ముగిసి వారం రోజులవుతున్నా ఒక్క నాలా పనులు కూడా పూర్తి కాలేదు. మరో వైపు వానలు మొదలైపోయాయి. రోజూ సిటీలో ఎక్కడోక చోట జల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిస్తే మరోసారి లోతట్టు ప్రాంతాలు, కాలనీలకు వరద ముంపు తప్పేలా లేదు. రెండేళ్ల కింద సిటీలో భారీ వర్షం కురిసినప్పుడు వందల కాలనీలు నీట మునిగాయి. ఆ టైంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ భవిష్యత్​లో సమస్య పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఎస్ఎన్ డీపీని ఏర్పాటు చేశామని, నాలాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

గతేడాది కురిసిన భారీ వర్షానికి మరోసారి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అప్పుడూ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు అవే మాటలు చెప్పారు. ఈసారి వర్షా కాలానికి ముందే ఫస్ట్​ఫేజ్​కింద రూ.633కోట్లతో 37 నాలాల పనులు స్టార్ట్​చేసి పూర్తి చేస్తామని ప్రకటించగా ఇంతవరకు కాలేదు. పనులు స్లోగా సాగుతుండడంతో సీఎస్ సోమేశ్​కుమార్ అనేకసార్లు సమీక్షలు పెట్టి ఆఫీసర్లపై సీరియస్​అయ్యారు. అయినప్పటికీ గడువులోగా ఒక్క నాలా పనులు కూడా పూర్తి కాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 173 నాలాలు ఉండగా, అవి 391 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 

వర్షం కురిసినప్పుడే హడావుడి

1908, 1970, 2000, 2016, 2017, 2020, 2021 సంవత్సరాల్లో సిటీలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నెలరోజులు దాటాక కూడా వరద నుంచి కోలుకోలేని కాలనీలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో నాలాల పూడికతీత నామమాత్రంగానే ఉంది. నాలాల వైడెనింగ్ పనులు చేపడుతున్నామంటూ రెండేళ్ల కింద ప్రకటించినా నేటికీ పూర్తిస్థాయిలో చేయలేదు. దీంతో రోజురోజుకు సమస్య తీవ్రమవుతోంది. నాలాల అభివృద్ధి పనులపై ఎస్ ఎన్ డీపీ అధికారులను అడిగితే.. చేస్తున్నామని, త్వరలోనే చోట్ల పూర్తవుతాయని, వర్షాలు కురిసినా ఇబ్బందులు లేకుండా చేశామని చెబుతున్నారు. 

కంకర లేక 20 రోజులు ఆగినయ్

జీహెచ్ఎంసీ అధికారులు పనులు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. కొన్నిచోట్ల ఆస్తుల సేకరణ పూర్తికాక స్లోగా సాగుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ ని తగ్గించాలంటూ క్రషెర్ కంపెనీల నిర్వహకులు గత నెలలో సమ్మెకు దిగడంతో  కంకర సప్లయ్ పూర్తిగా నిలిచిపోయింది. మూడు వారాల పాటు నాలాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కంకర సప్లయ్ జరిగి ఉంటే కొన్నిచోట్ల ఇప్పటికే పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు.

ఇప్పట్లో అయితయా?

సిటీలోని 37 చోట్ల పనులు ప్రారంభించినప్పటికీ రసూల్​పురా వంటి కీలకమైన ప్రాంతాల్లో మాత్రమే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఆరు చోట్ల పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగతా 31 పనుల్లో కొన్నింటికి ఆస్తుల సేకరణ అడ్డంకిగా మారిందని అంటున్నారు. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సర్ ప్లస్​నాలా పనులు ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రాంతంల్లో మాత్రమే జరుగుతున్నాయి. కొన్నింటికి అభ్యంతరాలు లేనప్పటికీ పనులు స్లోగా సాగుతున్నాయి. ఇలాగే చేస్తే పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు.