మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం : మెట్టు సాయికుమార్

మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం : మెట్టు సాయికుమార్

ముషీరాబాద్, వెలుగు: మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయికుమార్ చెప్పారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో మెట్టు సాయికుమార్ కు అభినందన సత్కార సభ నిర్వహించారు. చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగలిపల్లి శంకర్ మాట్లాడుతూ.. అటవీ సంపదపై స్థానికులకు ఏవిధమైన హక్కులు ఉంటాయో.. సంప్రదాయ మత్స్యకారులకు చేపల వేట, అమ్మకం, కులవృత్తిపై పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. అందుకోసం ప్రత్యేక చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యశాఖ ఉద్యోగాల్లో 40% వాటా కల్పించాలని, గంగపుత్ర కార్పొరేషన్​కు రూ.2వేల కోట్లు కేటాయించాలని, ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొప్పు పద్మ, సత్యనారాయణ, నరసయ్య, ప్రవీణ్, పరమేశ్వర్, సురేశ్, సుమిత్ర, రచ్చ ఎల్లయ్య, దయానంద్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.