వెయ్యి కోట్లతో మూసీ అభివృద్ధి

వెయ్యి కోట్లతో మూసీ అభివృద్ధి

హైదరాబాద్, వెలుగు: మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాన్ని టూరిస్ట్, ఉపాధి కల్పన జోన్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. మూసీ పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్​లో ప్రభుత్వం తెలిపింది. ‘‘మూసీ రివర్ ఫ్రంట్​ అభివృద్ధి చేసేందుకు నూతన విధానాలను పరిశీలిస్తున్నాం. 

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లండన్ పర్యటనలో థేమ్స్ నది డెవలప్ మెంట్ తీరును పరిశీలించారు. థేమ్స్ నది తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రిలతో చర్చలు జరిపాం. మూసీ అభివృద్ధికి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపడ్తం పీపుల్స్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, పిల్లల థీమ్ పార్క్​లు, ఎంటర్​టైన్ మెంట్ జోన్లు ఏర్పాటుచేస్తం. తద్వారా మూసీపరివాహక ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేసుగా మారుస్తం” అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.