
- టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్, వెలుగు : టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(ఆపరేషన్స్) పి.జీవన్ ప్రసాద్‌తోపాటు మరో ఏడుగురు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఆర్టీసీలో ఏండ్లపాటు సేవలందించిన వీరిని శుక్రవారం బస్ భవన్ లో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. ముఖ్యఅతిథిగా ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొని మాట్లాడారు. నిజాయతీ గల అధికారులు, సిబ్బందితోనే సంస్థ అభివృద్ధి చెందిందన్నారు.
రఘునాథరావు 1990 నుంచి 34 ఏళ్ల పాటు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలో వివిధ హోదాల్లో పనిచేశారని గుర్తుచేశారు. దాదాపు 2 వేల కొత్త బస్సులను రోడ్డు మీదకు తీసుకురావడంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గా ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చాలా కూల్‌గా పనిచేసి మంచి ఫలితాలను తీసుకొచ్చారని కొనియాడారు. 16 పర్యాయాలు మేడారం జాతరలో సమర్థంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. జీవన్ ప్రసాద్ ఆపరేషన్స్ విభాగంలో సమర్థంగా పనిచేశారని మొచ్చుకున్నారు. ప్రజల వద్దకు ఆర్టీసీ, విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ, చాలెంజ్ లను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉందన్నారు.
కార్యక్రమంలో సీఓఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, హెచ్ఓడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర సెక్రటేరియట్‌లోని జీఏడీ విభాగంలో 36 ఏండ్లు జమేదార్గా పనిచేసిన కుషాయిగూడకు చెందిన దూసరి నర్సింగ్రావుగౌడ్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. సీఎస్శాంతికుమారి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.