తిరుమల స్థాయిలో యాదగిరిగుట్ట అభివృద్ధి : సీఎస్ శాంతి కుమారి

తిరుమల స్థాయిలో యాదగిరిగుట్ట అభివృద్ధి :  సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానాన్ని వచ్చే మూడేండ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. బుధవారం బీఆర్కే భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైటీడీఏపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడి పరిసర ప్రాంతాలను, గ్రామాలను అభివృద్ధి చేసి, సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. దేవస్థానం నిర్మాణం చాలా బాగుందని, అలాగే, హెరిటేజ్ టెంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించి వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేవస్థానం అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులకు సీఎస్ సూచించారు. ప్రస్తుతం వైటీడీఏ పరిధిలో కేవలం 7 గ్రామాలే ఉన్నందున, ఈ పరిధిని మరింత విస్తరించాలని చెప్పారు. కాగా, యాదాద్రి దేవస్థానం నిర్మాణం, అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లను ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు. హుండీ, కానుకల ద్వారా సగటున రోజుకు రూ.5 లక్షల ఆదాయం వస్తుందన్నారు. గతేడాది రూ.130 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని  వివరించారు.