మేడారం జాతర: తిరుపతి తరహాలో అభివృద్ధి.. కనిపించని కోయల ఆనవాళ్లు

మేడారం జాతర: తిరుపతి తరహాలో అభివృద్ధి.. కనిపించని కోయల ఆనవాళ్లు

మేడారం జాతరకు రెగ్యులర్‌‌ భక్తుల తాకిడి పెరిగింది. రెండేండ్లకోసారి మహాజాతర, ఏడాదికోసారి జరిగే మినీ జాతరతో సంబంధం లేకుండా నిత్యం భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతి తరహాలో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వందల కోట్లతో టూరిజం, ఎండోమెంట్ బిల్డింగ్‌‌లు నిర్మించింది. 

నాలుగు లేన్లలో సిమెంట్‌‌ రోడ్లు వేయడంతో పాటు హరిత కాకతీయ వంటి ప్రభుత్వ హోటల్స్‌‌ను డెవలప్‌‌ చేస్తున్నారు. మేడారం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేలా సుమారు 30 ఎకరాల స్థలంలో కాటేజీలు నిర్మించాలని భావిస్తున్నారు. జంపన్నవాగును జీవనదిగా మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

కనిపించని కోయల ఆనవాళ్లు

రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుండగా.. 2010, 12 నాటికి మేడారం గద్దెల ప్రాంగణం చుట్టూ ఆదివాసీ జీవనశైలి కనిపించేది. గడ్డి, తాటాకుల గుడిసెలు, ఇంటి ముందర ఆవుపేడతో అలుకుచల్లి, ముగ్గులు వేసిన దృశ్యాలు కనిపించేవి. కోయలు నిత్యం ఉపయోగించే పనిముట్లు, వేటకత్తులు మట్టి గోడలకు వేలాడుతూ ఉండేవి. ఇంటిచుట్టూరా వెదురు కర్రలతో ప్రహరీ, లోపల నాటు కోళ్లు, మేకలు, ఆవులు కనిపించేవి. 

అప్పట్లో కరెంట్‌‌ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సాయంత్రమైతే కిరోసిన్‌‌ లాంతర్లు వెలిగేవి. 2016, 18 జాతరల నాటికి అడపాదడపా కోయల జీవన విధానం కనిపించినా.. ఇప్పుడు ఆ ఆనవాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు.