బాసరను పట్టించుకుంటలే.. భక్తులకు తప్పని తిప్పలు

బాసరను పట్టించుకుంటలే..  భక్తులకు తప్పని తిప్పలు
  • సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు
  • అమలు కాని సీఎం కేసీఆర్ హామీ

నిర్మల్, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు అటకెక్కాయి. బాసర పుణ్యక్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామంటూ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దేశ నలుమూలల నుంచి ఏటేటా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇక్కడ కనీస సౌకర్యాలను కల్పించడంలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందంటూ చెప్పుకుంటున్న పాలకులు బాసర సరస్వతి దేవిని మాత్రం పట్టించుకోవడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా వాసే అయినప్పటికీ ఆలయం అభివృద్ధి జరగకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

శంకుస్థాపన చేసి ఆరు నెలలు ముగిసినా..

యాదాద్రి తరహాలో బాసరను అభివృద్ధి చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ నెరవేరలేదు. 2018 ఎన్నికల సమయంలో సీఎం బాసర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఆలస్యంగా మంజూరయ్యాయి. జీవో నంబర్ 486 పేరిట బాసర ఆలయ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తికావడంతో ఈ ఏడాది మార్చిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ పని కూడా మొదలు కాలేదు. ఇందుకు కారణమేమిటన్నది అటు అధికారులతోపాటు ఇటు పాలకులు చెప్పడం లేదు.
 
భక్తుల అవస్థలు

ఆలయం వద్ద కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పిల్లల అక్షర శ్రీకారం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటారు. కనీసం రెండు రోజులైనా ఇక్కడే విడిది చేసి శ్రీకారం తర్వాత రాత్రి నిద్ర చేయడం సాంప్రదాయంగా వస్తోంది. వసంత పంచమి, వివిధ పండుగలు, శుక్రవారం రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు సక్రమంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

కనీసం తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదు. అక్షర శ్రీకారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గోదావరి వద్ద స్నానవాటికలు, గర్భగుడి విస్తరణ, ఆలయ ప్రాంగణ విస్తరణ రాజగోపుర నిర్మాణం, భక్తుల కోసం అదనపు వసతి గృహాల నిర్మాణం లాంటి పనులు చేపట్టాల్సి ఉంది. రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ కూడా చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. 

నిర్లక్ష్యమే కారణం..

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బాసర ఆలయ అభివృద్ధి జరగడం లేదు. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే,మంత్రి పట్టించుకోవడంలేదు. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన సర్కారు బాసర విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎన్నికల కోడ్​రాకముందే పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలి.

-  అంతగిరి రాజన్న, బాసర