ముంపు భూముల్లో పార్కు కడుతున్నరు.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు కంప్లయింట్స్

ముంపు భూముల్లో పార్కు కడుతున్నరు..  చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు కంప్లయింట్స్
  • లక్సెట్టిపేటలో రూ.65 లక్షల ప్రజాధనం వృథా 
  •  పట్టించుకోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు 
  •  ఇరిగేషన్​పర్మిషన్​లేకుండానే నిర్మాణాలు 
  •    

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు భూముల్లో పార్కులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను కడుతున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల పేరిటరూ. లక్షలను వృథా చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్​వాటర్​లో మునిగిపోతాయని తెలిసినా లీడర్లు, అధికారులు పట్టించుకోవడం లేదు. గోదావరికి గట్టి వరదలు వస్తే ఇవన్నీ నీటమునిగి ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయే ప్రమాదమున్నా లైట్​తీసుకుంటున్నారు.

పేరుకే పనులా?

ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా పార్కులు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను నిర్మించాలని ఆదేశించింది. కానీ లక్సెట్టిపేట మండలంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరి ప్రయోజనాల కోసం ముంపు భూముల్లో వీటిని నిర్మిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

గోదావరి ఒడ్డునే పార్కు

లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో టీఎస్​ఎఫ్​ఐడీసీ ఫండ్స్​రూ.65 లక్షలతో అర్బన్​పార్కు మంజూరైంది. పట్టణంలో అనుకూలమైన జాగాలు వదిలి, ఏకంగా గోదావరి ఒడ్డున ముంపు ప్రాంతంలో పదెకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ ​ముంపు భూములుగా గుర్తించింది. భూ యజమానులకు రూ.లక్షల్లో నష్టపరిహారం చెల్లించి సేకరించింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు బ్యాక్​ వాటర్​చేరుతుంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతంలోనే పార్కును ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. 

 ఇరిగేషన్​ఎన్​వోసీ ఉందా 

జిల్లావ్యాప్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు భూముల్లో వివిధ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ముంపు భూములుగా గుర్తించి సేకరించిన వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. పైగా వీటికి ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​నుంచి ఎన్​వోసీ తప్పనిసరి. ఇరిగేషన్​భూములను రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు కన్వర్షన్​చేసిన తర్వాత సంబంధిత నిర్మాణాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే ప్రజాప్రతినిధులు చెప్పడం, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేసి ఇష్టారీతిన నిర్మిస్తున్నారు.  ఇప్పటికే లక్సెట్టిపేటలో గోదావరి ఒడ్డున ముంపు భూముల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి ఫండ్స్​దుబారా చేశారు. ఇంతకుముందు మండలంలోని పోతెపల్లి గ్రామ శివారులోని ముంపు భూముల్లో పదెకరాల్లో మెగా  ప్రకృతివనాన్ని నిర్మించారు. గుల్లకోట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల్లో ఓ టీఆర్​ఎస్​లీడర్​దర్జాగా చేపల చెరువులు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ముంపు భూములను కబ్జా చేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

కలెక్టర్​కు కంప్లయింట్​చేసినా నో యాక్షన్ 

లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు భూముల్లో రూ.65 లక్షలతో పార్కు నిర్మిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండలానికి చెందిన బాణాల రమేశ్​అనే టీఆర్​ఎస్​లీడర్​ఇటీవల కలెక్టర్​ బదావత్​కు సంతోష్​కు కంప్లయింట్​చేశాడు. ఇప్పటికే తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట ఫండ్స్ దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రమేశ్​పేర్కొన్నాడు.