చెన్నూర్​పట్టణంలో పడకేసిన అభివృద్ధి పనులు

చెన్నూర్​పట్టణంలో పడకేసిన అభివృద్ధి పనులు
  • నాలుగేళ్లుగా పూర్తికాని ఫోర్​లైన్​రోడ్డు వర్క్స్ 
  • కంకరతేలి దుమ్ము లేవడంతో ప్రజలకు ఇబ్బందులు 
  • పునాదుల్లోనే డబుల్​బెడ్రూంలు  

మంచిర్యాల/ చెన్నూర్, వెలుగు: చెన్నూర్​నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు పడకేశాయి. మున్సిపాలిటీలో చేపడుతున్న వివిధ పనులు పూర్తి కాకముందే మార్చి 15న మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్​అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు. కొత్తగా చేపట్టబోయే పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికి నెలన్నర కావొస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అసంపూర్తి పనులతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. 

రోడ్డు సగమే వేసిన్రు..

మూడేళ్ల కిందట రూ.18 కోట్లతో జలాల్​పెట్రోల్​బంక్ నుంచి పాత బస్టాండ్​వరకు ఫోర్​లైన్​రోడ్డు, సెంట్రల్​లైటింగ్, డివైడర్స్, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్​కు బిల్లులు చెల్లించకపోవడంతో పలుసార్లు పనులు ఆపేశారు. మంత్రి హరీశ్​రావు రాకతో డాంబర్​రోడ్డు పనులు మొదలుపెట్టినట్లే పెట్టి సగభాగం మాత్రమే రోడ్డు వేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్​కు బిల్లు రాక మిగతా పనులు నిలిపేశాడు. ఆదరబాదరగా వేసిన రోడ్డులో క్వాలిటీ లేక గుంతలు పడుతున్నాయి. రోడ్డు వేయనిచోట కంకర పైకి తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కంకరపై నీళ్లు చల్లకపోవడంతో దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా సగం సగం పనులు చేసి వదిలేయడం ఏమిటని ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ పూర్తి కాలె..

రూ.9 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​మార్కెట్​ను మంత్రి హరీశ్​రావుతో ఓపెనింగ్​చేయించి నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంపై వ్యాపారులు, ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా పనులు నత్తనడకన సాగుతుండడంతో ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. చిరువ్యాపారులు రోడ్ల పక్కన ఎర్రటి ఎండలో కూరగాయలు అమ్ముకుంటూ అవస్థలు పడుతున్నారు. మార్కెట్​పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్​చేస్తున్నారు.

పునాదుల్లోనే డబుల్​ బెడ్రూంలు...

చెన్నూర్​లోని నేషనల్​హైవే పక్కన డబుల్​ బెడ్రూంల పనులు స్టార్ట్​ చేసి నాలుగేళ్లు అవుతున్నా పునాదులకే పరిమితమయ్యాయి. రూ.15 కోట్లతో 300 డబుల్​ బెడ్రూంలు నిర్మించాల్సి ఉండగా బేస్మెంట్​లెవల్​లోనే ఆగిపోయాయి. పట్టణంలో వేలాది మంది పేదలకు ఇళ్లు లేక డబుల్​బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​అందరికీ ఇండ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్​కు కోట్లలో బిల్లు పెండింగ్​ఉండడంతో పనులు బంద్​చేసి ఇక్కడి నుంచి సామాన్లన్నీ తీసుకోనిపోయాడు. దీంతో పేదలకు డబుల్​బెడ్రూంలు కలగానే మిగలనున్నాయి.


బేస్​మెంట్​లెవల్​లోనే స్కిల్ డెవలప్ మెంట్​సెంటర్​

యువతకు ఉపాధి కోసం వివిధ రంగాల్లో కోచింగ్​ఇచ్చేందుకు రూ.5 కోట్లతో చేపట్టిన స్కిల్​డెవలప్​మెంట్​సెంటర్​బిల్డింగ్​పనులు బేస్​మెంట్​లెవల్​లోనే ఆగిపోయాయి. నాలుగేళ్లు గడుస్తున్నా పనులు చేయకపోవడంతో బేస్​మెంట్​కు పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో కోచింగ్​ కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


100 బెడ్స్​హాస్పిటల్, ఆర్టీసీ బస్​డిపో..

పట్టణంలోని అస్నాద్​రోడ్​లో 100 బెడ్స్​హాస్పిటల్​నిర్మాణానికి, గెర్రె కాలనీ సమీపంలోని 869 సర్వేనంబర్​లోని అసైన్డ్​ భూముల్లో ఆర్టీసీ బస్​డిపో ఏర్పాటుకు హరీశ్​రావుతో శంకుస్థాపన చేయించారు. హాస్పిటల్​పనులు ప్రారంభించినప్పటికీ బస్​డిపో పనులు ఇంకా మొదలుపెట్టలేదు. బస్​ డిపో కోసం ప్రభుత్వం తమకు కేటాయించిన మూడెకరాల అసైన్డ్ భూమిని బలవంతంగా గుంజుకొని అన్యాయం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు డిపోకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని ట్రెంచ్​లు కొట్టారు.  

ఆహ్లాదం కరువైన కేసీఆర్​పార్కు..

పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం చెన్నూర్​నడిబొడ్డున ఏర్పాటు చేసిన కేసీఆర్​పార్కులో ఆహ్లాదం కరువైంది. సాయంత్రం పూట లైట్లు వెలుగకపోవడం, చెత్తా చెదారాన్ని తొలగించకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించినప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదని, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే ఇవన్నీ చేస్తున్నట్లు ఉందని మండిపడుతున్నారు.