- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు: జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ తప్పుడు హాజరు నమోదు చేసే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతీ మంగళవారం అంగన్‌వాడీ కేంద్రాలను, శుక్రవారం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సర్పంచులు, కార్యదర్శులు బాధ్యత వహించాలన్నారు. జూన్ 25లోగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ గుడ్ గవర్నెన్స్ అవార్డుకు జిల్లా నుంచి ఆరు గ్రామాలు నామినేట్ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ జాబితా సవరణకు సహకరించాలని కోరారు. మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
