అభివృద్ధి పనులే బీఆర్ఎస్​ను గెలిపిస్తయ్ : మంత్రి తలసాని

అభివృద్ధి పనులే  బీఆర్ఎస్​ను గెలిపిస్తయ్ :  మంత్రి తలసాని

సికింద్రాబాద్, వెలుగు: గడిచిన తొమ్మిదన్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్​ను గెలిపిస్తాయని ఆ పార్టీ సనత్​నగర్ సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం బేగంపేట డివిజన్​లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతాపూర్​లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగాయన్నారు. 2014కు ముందు సనత్ నగర్ నుంచి గెలిచిన వారు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇక్కడి నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సెగ్మెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి సమస్యలను పరిష్కరించానన్నారు. నిరంతరం జనం మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. 

బేగంపేట డివిజన్​లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి పైప్ లైన్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. బ్రాహ్మణవాడి, వడ్డెర బస్తీ ఏరియాల్లో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.45 కోట్లతో ఎన్ ఎన్ డీపీ కింద బేగంపేట నాలాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. 

తలసాని శ్రీనివాస్ వెంట కార్పొరేటర్ మహేశ్వరి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,  జనరల్ సెక్రటరీ ఆరీఫ్, నాయకులు నరేందర్ రావు, శేఖర్, అఖిల్, మొయినుద్దీన్, జావిద్, ప్రవీణ్ పాల్గొన్నారు. మరోవైపు తలసాని శ్రీనివాస్​కు ఎంఐఎం నేతలు మద్దతు తెలిపారు. బేగంపేట డివిజన్ లో ఆయన నిర్వహించిన ప్రచారంలో ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.