గుట్టపై భక్తుల ఇక్కట్లు 

గుట్టపై భక్తుల ఇక్కట్లు 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మి పుష్కరిణి ప్రాంతాలు కిక్కిరిసాయి. కొండపై బస్ బే, దర్శన టికెట్ల కౌంటర్లు, క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి. లడ్డూలు, పులిహోర కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర టైం పట్టింది.  

కొండపైన భక్తుల ఇక్కట్లు

గుట్టపై సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తు లు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల గాలివానకు కొండపై చలువ పందిళ్లు ఎగిరిపోవడంతో.. భక్తులు సేద తీరే అవకాశం లేకుండా పోయింది. ఎండలు మండుతుండడం, చలువ పందిళ్ల పునరుద్ధరణ పనులు కంప్లీట్ కాకపోవడంతో అవస్థలు పడ్డారు. చంటిపిల్లలతో వచ్చిన భక్తుల బాధలు వర్ణణాతీతం. ఓ వైపు ఎండ, మరోవైపు క్యూలైన్లలో మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడం, అక్కడక్కడా నల్లాలు ఏర్పాటు చేసినా.. ఎండకు నీళ్లు వేడిగా రావడంతో తాగలేకపోయారు. వాటర్ బాటిల్స్​ కొందామన్నా దొరకే అవకాశం లేకుండా చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.26,42,089 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.12,26,750 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. 

ఆలయ పునర్నిర్మాణం భేష్

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కాకినాడ జీయర్ ఆశ్రమ పీఠాధిపతి త్రిదండి రంగరామానుజ జీయర్ స్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసిహాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాత్రి స్వామివారి  పవ ళింపుసేవలోనూ పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్వామివారికి నిర్వహించే అభిషేక పూజలో పాల్గొంటారని 
ఆఫీసర్లు తెలిపారు.