యాదగిరిగుట్టలో భక్తుల అవస్థలు

యాదగిరిగుట్టలో భక్తుల అవస్థలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. భక్తులకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో చంటిపిల్లలతో వచ్చిన భక్తులు నానా అవస్థలు పడ్డారు. భక్తుల రాక విపరీతంగా పెరగడం, అందుకనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది భక్తులు నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఇదేరకమైన పరిస్థితి తలెత్తడంతో భక్తులు ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీకి అనుగుణంగా బస్సులను సర్దుబాటు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని సీరియస్ అయ్యారు. రద్దీ కారణంగా నరసింహుడి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు జరిపించిన పలురకాల పూజల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.42,85,155 ఇన్ కం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.18,83,050, కొండపైకి భక్తుల వెహికల్స్​ప్రవేశం ద్వారా రూ.6 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,76,400 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. 

లడ్డూల కోసం పోటాపోటీ
ఆదివారం భక్తుల రద్దీకి సరిపడా లడ్డూలను సరఫరా చేయడంలో ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారు. ఆదివారం కొండపైన లడ్డూల కొరత ఏర్పడడంతో ఆలయ ఆఫీసర్లతో భక్తులు గొడవకు దిగారు. రద్దీకి అనుగుణంగా లడ్డూలను ఎందుకు అందుబాటులో ఉంచలేదని వాగ్వాదానికి దిగారు. ఎస్పీఎఫ్ పోలీసుల సహకారంతో భక్తులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మిషన్ రిపేర్ల కారణంగా పాతగుట్ట నుంచి లడ్డూలను తెప్పిస్తున్నామని, కాసేపు సహకరించాలని ఆఫీసర్లు చెప్పినా భక్తులు శాంతించలేదు. మరోవైపు ప్రసాద కౌంటర్ల క్యూలైన్లు నిండిపోవడంతో మిగతా భక్తులు కౌంటర్ హాల్ లోకి రాకుండా డోర్లు మూసివేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భక్తులను కంట్రోల్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు వీఐపీ టికెట్లు, కల్యాణం జరిపించిన భక్తులు లడ్డూల కోసం ఒకేసారి రావడంతో ప్రసాద కౌంటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో పాతగుట్ట నుంచి లడ్డూలు కొండపైకి చేరుకోవడంతో భక్తులు శాంతించారు. పోలీసుల సహకారంతో ప్రత్యేక క్యూలైన్లు నడిపించి భక్తులకు లడ్డూలు అందజేశారు.