మల్లన్నా శరణు.. శరణు..కొమురవెల్లిలో పట్నం వారానికి పోటెత్తిన భక్తులు

మల్లన్నా శరణు.. శరణు..కొమురవెల్లిలో పట్నం వారానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారానికి (మొదటి ఆదివారం) భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పట్టింది.  రాజగోపురం నుంచి ఎల్లమ్మ కమాన్ మీదుగా భక్తులు బారులుతీరారు.  

అనంతరం మల్లన్న గుట్టపైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మకు బోనం సమర్పించి ఒక్క పొద్దులను వదిలారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ తోటబావి వద్ద అధికారులు పెద్దపట్నం, అగ్నిగుండాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన బండారి ప్రవీణ్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. –కొమురవెల్లి, వెలుగు