
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. హైదరాబాద్‌సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతో బస్‌బే, ధర్మదర్శన, ప్రత్యేక దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.55,26,706 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.20,64,680, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.10.20 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,99,500 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామిని ఎంబీసీ చైర్మన్‌జెరిపేటి జైపాల్ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం వేదాశీర్వచనం చేయగా.. ఏఈవో రమేశ్‌బాబు, సూపరింటెండెంట్ రాజన్‌బాబు స్వామివారి ప్రసాదం అందజేశారు.
వేములవాడ రాజన్న ఆలయంలో..
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయమే క్యూలో చేరిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కోర్కెలు తీర్చాలంటూ కోడె మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈఓ రాధాబాయి పర్యవేక్షించారు.