శివుడికి నైవేద్యంగా పీతలు

శివుడికి నైవేద్యంగా పీతలు

కోరిన వరాలిచ్చే దేవుడు  భోళా శంకరుడు. ఈశ్వరుడిగా , సర్వేశ్వరుడిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చే శివుడు అభిషేక ప్రియుడు. నెత్తిన కొన్ని నీళ్లు పోసినా సంతోషిస్తాడు. అందుకే  శివుడికి భక్తులంతా అభిషేకాలు చేస్తారు. బిల్వదళాలను సమర్పించి ప్రత్యేక పూజలు  నిర్వహిస్తారు. అయితే భారత్లో ఓ శివాలయంలో భోళా శంకరుడికి పీతలు సమర్పిస్తే సంతోషిస్తాడు. 

 దేశంలో  ఎన్నో  పురాత‌న శివాలయాలు ఉన్నాయి.  స్థలపురాణం ప‌రంగా ఎంతో విశిష్టత‌ను క‌లిగి ఉన్న ఆలయాలు ఉన్నాయి.  నిర్మాణం, ఆకృతి, పరంగా మరికొన్ని ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రం సూరత్ లో ఉన్న  శివాల‌యం మాత్రం వీట‌న్నింటికీ భిన్నమైంది. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలను భక్తులు సమర్పిస్తారు. 

గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో భక్తులు శివుడికి బ్రతికి ఉన్న పీతలను సమర్పిస్తుంటారు. ఈ ఆలయంలో మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే  భక్తుల నమ్మకం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బతికి ఉన్న  పీతలను శివునికి నైవేధ్యంగా సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు, తమ పిల్లలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయంటున్నారు. శివునికి భక్తులు పీతలను సమర్పించిన తర్వాత ఆలయ అధికారులు వాటిని తాపీ నదిలో వదులుతారు.