
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాహు కేతు పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి కావడంతో దేశం నలుమూలల నుంచి సామాన్యులు మొదలుకొని సెలెబ్రిటీల దాకా చాలా మంది రాహుకేతు పూజల కోసం ఇక్కడ వస్తుంటారు. ఈ క్రమంలో రాహుకేతు పూజల కోసం నాగ పడగలు విరాళంగా ఇచ్చారు ఇద్దరు భక్తులు. మంగళవారం ( సెప్టెంబర్ 2 ) ఆలయ అధికారులకు విరాళాన్ని అందజేశారు భక్తులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన పల్లార రాజు, ద్రాక్షారామంకు చెందిన పూర్ణచంద్రరావులు ఒక్కొక్కరు రూ. లక్షా 22 వేలు విలువజేసే రాగి రేకుపై బంగారు తాపడం పట్టిన నాగపడగలను విరాళంగా ఇచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డికి విరాళాన్ని అందించారు భక్తులు.
నాగపడగలను మండపేటకు చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ తయారు చేశారని.. ఆయన అయోధ్య ఆలయంలో బలరామ ఉత్సవమూర్తి విగ్రహమును, కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పంచముఖ జటాజూటంను, శ్రీశైలం ఆలయంలో శ్రీ స్వామివారికి జటాజూటంను, ద్రాక్షారామంలో శ్రీ స్వామివారికి జటాజూటంను తయారు చేశారని తెలిపారు.