
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణనాథుడుని దర్శించుకోవడానికి భక్తులు శనివారం పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బడా గణేష్ను నిలిపిన నాలుగో రోజు(శనివారం) వీకెండ్ కావడంతో భక్తులు కుటుంబాలతో కలిసి దర్శనానికి విచ్చేస్తున్నారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర ఫుల్ రష్ ఉంది. 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా మహా గణనాథుని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
నేడు (శనివారం) అర్ధరాత్రి 11.45 వరకు మెట్రో సేవలను అందించనున్నారు. మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులతో క్యూ లైన్లు అన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గంట గంటకూ భక్తుల రద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆకతాయిల పని పట్టేందుకు షీ టీమ్స్ ఫోకస్డ్గా పనిచేస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ తరఫున అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాల ఆదాయం 2024లో కోటీ 10 లక్షలు వచ్చింది. ఖైరతాబాద్ గణేశ్ఉత్సవాలు మొదలై 2025తో 71 ఏండ్లు అయ్యింది. శుక్రవారం కూడా ఖైరతాబాద్ గణేష్ దగ్గర భక్తుల తాకిడి కనిపించింది. 108 హోమ గుండాలతో మహా హోమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ హోమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉంది.