- నర్సన్న సన్నిధిలో మూడో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు
- న్యూ ఇయర్ సందర్భంగా పోటెత్తిన భక్తజనం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం రామావతారంలో, సాయంత్రం తిరువేంకటపతిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.
సన్నాయి వాయిద్యాలు, మేళ తాళాల హోరులో వేదపారాయణాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీరాముడు, తిరువేంకటపతి అలంకార సేవలను అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నారసింహుడు.. లక్ష్మీసమేతుడై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు.
సాయంత్రం తిరువేంకటపతి అలంకారంలో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఆలయ తిరువీధుల్లో విహరింపజేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం వెన్నకృష్ణుడు, సాయంత్రం కాళీయమర్ధనుడి అలంకార సేవలు చేపట్టనున్నారు.
ఉదయం 7.45 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు
హరిహరులకు నిలయమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం గురువారం 'న్యూ ఇయర్' శోభ సంతరించుకుంది. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచే భక్తులతో పాటు స్థానిక ప్రజలు కూడా యాదగిరిగుట్టకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పంచనారసింహుడు, శివకేశవులను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
దర్శన, లడ్డూప్రసాద క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం ఉదయం 7:45 నుంచి రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్ గా దర్శనాలు కొనసాగించారు. ఉదయం 5 గంటల నుంచే ప్రసాద కౌంటర్లు తెరిచారు. స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు
