భక్తులకన్నీ కష్టాలే

భక్తులకన్నీ కష్టాలే
  • బాసరలో కనిపించని సౌకర్యాలు
  • గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు

Devotees troubles in Basaraబాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి వచ్చిన భక్తులు సౌకర్యాల్లేక అవస్థలు
పడుతున్నారు. అమ్మవారి దర్శనానికి అనేక రాష్ట్రాలనుంచి భక్తులు వస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో లక్షల మంది వస్తుంటారు. వారందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పించలేదు. బాసర
ఆలయానికి ఏటా కోట్లల్లో ఆదాయం వస్తోంది. కమిషనర్‌ స్థాయి అధికారి ఈవోగా ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలతో ఓనమాలు దిద్దించేందుకు అనేక ప్రాంతాలనుంచి తల్లిదండ్రులు వస్తుంటారు. వసంతపంచమి, శివరాత్రి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో భక్తులు పోటెత్తుతారు. కానుకలు, ఇతర మార్గాల్లో ఆలయానికి భారీగా ఆదాయం వస్తున్నా భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గుడిలో శాశ్వత క్యూ లైన్లు, రద్దీకి తగ్గట్టు అతిథిగృహాలు, సత్రాలు లేక భక్తులు నానా పాట్లు పడుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లో గంటల తరబడి నిలబడాల్సివస్తోంది. సరైన సదుపాయాలు లేక ఆదివారం నాడు కొందరు అక్షరాభ్యాసాలు
చేయించకుండానే వెనుదిరిగారు. శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా
ఉంటుంది. తాత్కాలిక క్యూలైన్లలో వేచిఉన్నవారికి కనీసం టాయ్‌లెట్‌ వసతి అయినా కల్పించకపోవడంతో షుగర్, బిపి పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. పదేళ్ల కింద టిటిడి వారు నిర్మించిన
వంద గదుల సత్రంలో 78 గదులే ఉపయోగంలో ఉన్నాయి. ఇందులోనూ ఎక్కువ గదులను
భద్రతాఏర్పాట్లకోం వచ్చిన పోలీసు అధికారులు, వీఐపీలకు కేటాయించడంతో సాధారణ
భక్తులకు వసతి అందడంలేదు. గుడి దగ్గరున్న ఎనిమిది గెస్టుహౌజుల్లో నాలుగు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మరో నాలుగు రిపేర్లో ఉన్నాయి. దీంతో భక్తులు ప్రైవేట్ లాడ్జిల్లో ఉండాల్సివస్తోంది. బాసర ఆలయ అభివృద్దికి సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన 50 కోట్లతో శాశ్వత క్యూ కాంప్లెక్స్ నిర్మించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.