మహా భారత కాలంలో స్త్రీలు ఎంతో ధైర్యంగా ఉండేవారనడానికి అందులోని పాత్రలు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తాయి. శకుంతల, దమయంతి, సత్యవతి, కుంతి, ద్రౌపది, సత్యభామ, సుభద్ర.. ఇలా ప్రతి ఒక్కరూ మొక్కవోని ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని, జీవితాన్ని ఆనందమయం చేసుకున్నట్లుగా భారతం చెబుతోంది.
అందునా ముఖ్యంగా ద్రౌపది పాత్ర ధైర్యానికి మారుపేరుగా కనిపిస్తుంది. పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె, పాండవుల ఇంటి కోడలు, ఐదుగురు యోధులకు భార్య అయిన ద్రౌపది ఎదుర్కొన్నన్ని కష్టాలు చరిత్రలో మరే ఇతర స్త్రీ ఎదుర్కోలేదేమో అనిపిస్తుంది.
దుర్యోధనుడితో ఆడిన జూదంలో ధర్మరాజు... తన తమ్ముళ్లను, భార్యను కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. అయినా ధర్మం కోసం పెదవి కదపలేదు ద్రౌపది. అరణ్యవాస సమయంలో సైంధవుడి వల్ల అవమానం పొందింది. దానికి తక్షణమే పాండవులు ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇక అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు కొలువులో సైరంధ్రిగా ఉన్న రోజుల్లో కీచకుడు ద్రౌపదిని చెరపట్టాలని చూశాడు. అతడిని నర్తనశాలకు రప్పించి, భీముడి చేతిలో హతమయ్యేలా చేసింది. అంతటి ధీమంతురాలు ద్రౌపది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకుంది. అంతటి ధైర్యవంతురాలు ద్రౌపది.అటువంటిది పాండవులు సంధి చేసుకోమని శ్రీకృష్ణుడిని కౌరవుల దగ్గరకు పంపడం చూసి రగిలిపోయింది. శ్రీకృష్ణుడితో తన మాటగా ఇలా పలికింది.
ఇవి దుస్ససేను వ్రేళ్లం దవిలి
సగము ద్రెవ్విపోయి దక్కినయవి కౌ
రవుల కడ దీఱుమాటల యవసరమున
దలపవలయు నచ్యుత వీనిన్
కృష్ణా! ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతి వ్రేళ్లలో ఇరుక్కొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వాక్యాలు పలికే సందర్భంలో ఈ కేశాలను గుర్తుంచుకోవాలి.. అని పలికింది.
(ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం, 116వ పద్యం). అక్కడితో ఆగకుండా.. ‘కృష్ణా! రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ముందుగా నా తల వెంట్రుకలను పట్టి సభలోనికి ఈడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతడి దేహం చిన్న చిన్న ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి పడినప్పుడే నా కోపాగ్ని చల్లారుతుంది. చిన్న చిన్న పనులతో నా కోపం ఏ మాత్రం చల్లారదు. అంతేకాదు... వారి చేతిలో పరాభవం పొందిన ధర్మరాజు, నేను... దుర్యోధనుడి శవాన్ని కళ్లారా చూడగలగాలి.
లేదంటే.. కొండంత గదను భుజాన వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలం, గాండీవం అనే పేరు గల పెద్ద విల్లు ధరించిన అర్జునుడి శౌర్యం ఎందుకు.. అని చాలా తీవ్రంగా, పరుషంగా, ధైర్యంగా ప్రశ్నించింది. అదీ ద్రౌపది వీరత్వం. అవసరమైనప్పుడు... పాండవులను తల్లిలా లాలించింది. తిరగబడవలసివచ్చినప్పుడు అపరకాళికలా ప్రశ్నించింది. స్త్రీలోకానికి ధైర్యాన్ని బోధించడానికి ప్రతీకగా నిలబడింది.
ఇక కుంతీదేవి పాత్రను పరిశీలిస్తే.. పాండుమహారాజు ధర్మపత్ని, కుంతిభోజుని కుమార్తె. రాచబిడ్డ. పాండురాజు కోరిక మేరకు దేవతలను ప్రార్థించి సంతానవతి అయింది. లక్క ఇల్లు తగులబడినప్పుడు, తన కుమారులైన పాండవులతో పాటు తప్పించుకుంది. అంతటి విపత్తు సమయంలోనూ ఆవిడ ధైర్యాన్ని కోల్పోలేదు. దుర్యోధనుడు శకునితో కలిసి ఆడిన మోసపూరిత జూదంలో తన కుమారులు అడవులపాలైనప్పటికీ ఓరిమితో సహించింది.
తన ఇంటి కోడలికి పరాభవం జరిగిందని తెలిసి కూడా, ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టలేదు. దాయాదుల ఇంట వారి దయాదాక్షిణ్యాల మీద భోజనం చేయవలసి వచ్చినా ధైర్యాన్ని కోల్పోలేదు. ధర్మానికి కట్టుబడి పాండవులు పదమూడు సంవత్సరాల అరణ్య, ఒక సంవత్సరం అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని వచ్చిన తరువాత తనను చూడటానికి వచ్చిన శ్రీకృష్ణుని దగ్గర పెదవి కదిపింది. ‘కృష్ణా! నా కోడలికి జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు కౌరవులతో రాయబారం నడిపించాలి’ అని పలికింది. అదీ స్త్రీశక్తి.
మరో పాత్ర శకుంతల..
కణ్వుని దగ్గర పెరిగిన శకుంతల దుష్యంతుని గాంధర్వ వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత దుష్యంతుడు తన రాజ్యానికి బయలుదేరుతూ, త్వరలోనే తన పరివారంతో వచ్చి శకుంతలను రాజ్యానికి తీసుకెళ్తానని పలికి వెళ్లిపోయాడు. శకుంతల కుమారుడికి జన్మనిచ్చింది.
అప్పటికీ దుష్యంతుడి దగ్గర నుంచి సమాచారం లేకపోవడంతో తన బిడ్డను వెంటబెట్టుకుని, దుష్యంతుని సభలో నిలబడి, ధైర్యంగా ప్రశ్నించింది. దుష్యంతుడు తనను స్వీకరించేలా చేసుకోగలిగింది. అంతటి ధైర్యశాలులు, నిర్భయంగా మాట్లాడగలిగే శక్తిశాలురకు జన్మనిచ్చింది భారతదేశం.
- డా. పురాణపండ వైజయంతి, (మహిళా దినోత్సవ ప్రత్యేకం)-
