
జీవించి ఉన్నంత కాలం విధ్యుక్తకర్మని ఆచరిస్తూనే ఉండాలని, స్వధర్మాన్ని, నిర్వర్తిస్తూనే ఉండాలని బోధించాడు శ్రీకృష్ణుడు. దాని కోసం చేయవలసిన పని ఏది అనేది తెలుసుకోగల జ్ఞానం ఉండటం అవసరం. అందుకని అటువంటి జ్ఞానం అందిస్తూ దానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలుచెప్పాడు.
ముఖ్యమైన విషయాన్ని బోధించటానికి ముందు వినటానికి సంసిద్ధం చేయాలి కదా . ఈ విషయంలో ప్రవేశించటానికి ముందు దాని ఘనతని చెపితే మరింత శ్రద్ధగా వింటారు. అర్జునుణ్ణి నెపంగా చేసుకుని సర్వమానవాళిని కర్తవ్యోన్ముఖులను చేస్తున్నాడు. జగద్గురువు శ్రీ కృష్ణుడు.
ఇది పురాతనమైన యోగము అంటాడు. యోగము అంటే ఏమిటో చక్కని నిర్వచనం ఇవ్వనే ఇచ్చాడు కదా. "కర్మను కౌశలం" అని పనులలో నేర్పరితనం. ఏ పని అనే దగ్గర నుండి ఎప్పుడు, ఎట్లా చెయ్యాలి అనే దాకా.... అన్నీ కలిసి వచ్చే విధంగా ప్రయోజనమనే ఒకే ఒక లక్ష్యం సాధించే విధంగా చేయటం.... ముందు లక్ష్యం ఏమిటో నిర్ణయించుకోవటం ప్రధానం... ఇదే చాలా మందికి తెలియనిది. పని చేస్తూనే అది. తనని బంధించకుండా చూసుకోవటం.. ఈ జ్ఞానం చాలా ప్రాచీనమైనది.
ALSO READ : ఆధ్యాత్మికం : జూలై 28వ తేదీ సోమవారం శక్తివంతమైన రోజు ఎందుకు..? : ఆ రోజు ఈ ఇద్దరు దేవుళ్లను పూజించండి..!
ఎంత? అంటే....సూర్యుడికి నేను ఉపదేశించాను. ఆ వివస్వంతుడు మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుకి ఉపదేశించాడు. ఇట్లా పరంపరగా అంటే ఒకరినుండి మరొకరికి అందిన యోగవిద్య సృష్టిలోని ప్రతి అణువులోను మేలుకొనటం చేత ప్రతి అణువు 'నేను' అనే మెలకువతో వేరు వేరుగా అస్తిత్వాన్ని పొందాయి. ఆ కారణంగా కాలక్రమంలో యోగము (కలిసి ఉండే స్థితి) వివిధత్వంలోకి నష్టమయింది. నాచే ఉచ్ఛరించబడిన ఈ పురాతన యోగం నాకు సఖుడవు. భక్తుడవు కనుక నీకు ఉపదేశించాను." అంటాడు శ్రీ కృష్ణుడు.
కృష్ణుడు ఇప్పటివాడు. సూర్యుడు ప్రపంచం ఏర్పడినప్పటి నుండి ఉన్నవాడు. ఇదెలా సాధ్యం?
ప్రతి జీవిలోను 'నేను' అని చెప్పబడే ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. మిగిలినవి అంటే ఇంద్రియాలు, అవయవాలు భావనలు మొదలైనవి 'నావి' అనబడతాయి. ఇవన్నీ కలిపితేనే జీవి.
మనిషిలో లాగానే ఇవన్నీ ప్రతి అణువులోను. భూగోళంలోను, సూర్యుడిలోను కూడా ఉంటాయి. ఇంద్రియాలకి అవయవాలకి కేంద్రస్థానం 'నేను' అయినట్టే, గోళాలకి అవి దేనిచుట్టూ తిరుగుతూ ఉంటాయో ఆ సూర్యుడు కేంద్రం.
మొత్తానికి ఆధారం సూర్యగోళంలో మేల్కొన్న 'నేను' సర్వానికి ఆధారం. గ్రహాలు, గోళాలు, వాటిలో జీవులు పుట్టటానికన్నా ముందే సూర్యుడు పుట్టటం, సూర్యుడిలో 'నేను' అనే ప్రజ్ఞ మేల్కొనటం జరిగింది. అందుకే 'నేను' అనే ప్రజ్ఞకి అధిపతి, జీవులలో 'నేను' అనే భావన కలగటానికి కారకుడు సూర్యుడు.మొట్టమొదట సూర్యుడికి ఉపదేశం చేసి అతడిలో 'నేను' అనే ప్రజ్ఞను మేల్కొన చేసినది "నేను" అని చెప్పాడు కృష్ణుడు.
ఇక్కడ "నేను" అంటే కృష్ణుడు అని అర్ధం చెప్పుకుంటే పొరపాటు పడినట్టే.ఈ విశ్వమంతా అంతర్యామిగా వ్యాపించిన 'ఆత్మన్' అని సంస్కృతంలో వ్యవహరింపబడే 'నేను'అనే ప్రజ్ఞ సూర్యుడిలో మేల్కొన్న నేను అనే ప్రజ్ఞ సూర్యుడి వికాసంగా వ్యాప్తి చెండేట్టు చేశాడట. వ్యాపించిన వికాసంలో నేనుగా ఉన్న సూర్యుడు వివస్వంతుడుగా ఉండటాన్ని ఉపదేశంగా పొందాడు.
వివస్వంతుడు అంటే అనేక విధాలుగా ఉండటం కోసం వెలుగులని దారాలుగా తీసి, తన చుట్టూ వస్త్రంగా అల్లుకొన్నవాడు అని అర్థం ..ఇట్లా తన చుట్టూ అల్లుకొన్న దారాల ఉండ మాదిరిగా సూర్యుడికి గోళాకారం ఏర్పడింది.. సూర్యుడికి తన సౌర కుటుంబానికి సంబంధించిన ధర్మాలు కొన్ని ఉన్నాయి.
ఆ ధర్మాలని నిర్వర్తించటానికి సూర్యుడి నుండి దిగి వచ్చిన మానవమూర్తి మనువు. అంటే సూర్యుడి మనసు అని చెప్పవచ్చు. మన్వంతరాలు పుట్టి కాలవిభాగాలు ఏర్పడి, సృష్టిలోని వివిధ స్థితులు ఏర్పడటానికి ఇతడే కారణం. మనుపు సూర్యుడి మనసు కనుక అతడి సంతతి అయిన మానవులు మనోమయ జీవులు అయ్యారు.
ఈ యోగాన్ని మనువు ఇక్ష్యాకునికి అందజేశాడు. భూమిపై జీవుల నిర్మాణం, నిర్వహణం చేయటానికి భూమికి దిగివచ్చినవాడు ఇక్ష్వాకువు. ఇతడు సూర్యుడి నుండి దిగి వచ్చాడు కనుక సూర్యవంశపు రాజుగా చెప్తారు.ఇంతవరకు ఒకరి నుండి మరొకరికి పరంపరగా అంది ఈ యోగం భూమికి దిగివచ్చి భూమిపై ప్రతి అణువులోనూ చేరింది. దానితో ఏకత్వం నుండి వివిధత్వంలోకి ప్రవేశించి, కనుమరుగయింది. అయితే ప్రతి అణువులోను మేల్కొన్న 'నేను' అనే ప్రజ్ఞలో ఉన్నది "నేనే" కనుక ప్రతి మానవుడికి విడివిడిగా ఈ పురాతన యోగాన్ని అందించగలను అంటాడు కృష్ణుడు.
మొదట ఉపదేశం చేసింది తనే కదా. సూర్యుడికి చేసినట్టే అందరికి వారి వారి జీవప్రజ్ఞలు యోగాన్ని అందుకునేట్టు చేయటం తన చేతిలో పనే. నిజానికి "నేను" ఉచ్చరించినది జగత్తుగా అయింది.
తనకే ఎందుకు ఉపదేశించాడు. అనే సందేహం అర్జునుడికి రావచ్చు. దానికి కూడా సమాధానం చెపుతున్నాడు.
ఈ యోగాన్ని పొందటానికి కావలసిన అర్హత పరస్పర అనుకూల ప్రవృత్తి. అది ఇంతకు ముందు నుండి కృష్ణార్జునుల మధ్య సఖ్యత రూపంలో ఉంది. ఇప్పుడు భక్తుడనని కూడా అర్జునుడు చెప్పుకున్నాడు. చెప్పింది యథాతథంగా ఆచరణలో పెట్టగల మానసిక స్థితి ఉంది.
సఖుడు, భక్తుడు అవటం వల్ల రహస్యమైన ఈ యోగాన్ని ఉపదేశిస్తున్నాను అన్నాడు కృష్ణుడు. ఇది భక్తి లేని వారికి అందదు. ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది. 'రహస్యం' అంటే మాటలతో బోధించినా అసలు విషయం మనసుకి తట్టదన్నమాట. పదాలకున్న మామూలు అర్ధం తెలుస్తుందే కాని, తత్త్వం స్ఫురించదు. సమస్తమైన వెలుగుకి కారణమైన (సూర్య ప్రజ్ఞ నుండి వచ్చినది కదా) ఈ యోగం పరమరహస్యంగా ఉంది. దాని స్థానం అన్ని జీవుల లోపల ఉంటుంది. అందుకే లోచూపుతో మాత్రమే తెలుస్తుంది.