
ఢిల్లీ : ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆ ఘటన జరిగిన న్యూయార్క్- ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్‌కు రూ.3 లక్షల పెనాల్టీ విధించింది.
గతేడాది నవంబరు 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాసులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో శంకర్ మిశ్రా కొన్ని రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీన పోలీసులు అతడిని బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. కోర్టు తిరస్కరించి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
నిందితుడిపై ఎయిర్ ఇండియా నిషేధం
విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది.