ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలె.. వర్షాలపై డీజీపీ సమీక్ష

 ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలె.. వర్షాలపై డీజీపీ సమీక్ష

తెలంగాణ రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. వర్ష ప్రభావిత ప్రాంతాల జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శుక్రవారం (జులై 21న) ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. జిల్లాల్లోని అన్ని శాఖలు సమన్వయంతో, ప్రణాళికా బద్దంగా పని చేయాలని డీజీపీ ఆదేశించారు. వర్షాలు, వరదల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేస్తూ.. వారిని చైతన్యపర్చాలని సూచించారు.

ఉత్తర తెలంగాణలో వరదలు ఎక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుండి ప్రజలు సహాయ, సహకారాల కోసం ఎదురుచూస్తారని అన్నారు డీజీపీ. ఈ పరిస్థితుల్లో పోలీసు అధికారులు తమ నాయకత్వ ప్రతిభను చూపించి.. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఐజీ. చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.