మెదక్ ఘటనపై డీజీపీ సీరియస్

మెదక్ ఘటనపై డీజీపీ సీరియస్

మెదక్ జిల్లాలోలాకప్ డెత్  ఘటనపై డీజీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు.   ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని  ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. ఘటనకు కారణమైన మెదక్ సీఐ,ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని  ఆదేశించారు. 

చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడనే అనుమానంతో మెదక్  పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్  ను జనవరి 29న పోలీసులు అరెస్ట్ చేశారు.  ఫిబ్రవరి 2  వరకు పీఎస్ లో ఉంచిన పోలీసులు అసలు నిందితుడు ఖదీర్ ఖాన్ కాదని అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఆ తర్వాత ఖదీర్  తీవ్ర గాయాలతో అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజులుగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఈ నెల 16న మృతి చెందాడు.  అయితే పోలీసుల చిత్రహింసలకే ఖదీర్ ఖాన్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఖదీర్ ఖాన్ భార్య  సిద్ధేశ్వరి ఆమె పిల్లలతో కలిసి శుక్రవారం మెదక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మెదక్ టౌన్ ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ పవన్ కుమార్, ప్రశాంత్  తన భర్తను కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆరోపించింది. కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.