తెలంగాణ టీ20 లీగ్‎ వేలంలో డీజీపీ సీవీ ఆనంద్‎ కొడుక్కి జాక్ పాట్

తెలంగాణ టీ20 లీగ్‎ వేలంలో డీజీపీ సీవీ ఆనంద్‎ కొడుక్కి జాక్ పాట్

హైదరాబాద్: తెలంగాణ టీ20 లీగ్ వేలంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు, బౌలర్ సీవీ మిలింద్ జాక్ పాట్ కొట్టాడు. ఆదివారం (జూన్ 7) రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన టీజీ 20 లీగ్ వేలంలో రూ.17 లక్షల భారీ ధరకు సీవీ మిలింద్‏ను ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. బేస్ ఫ్రైస్ రూ.5 లక్షలతో ఐకాన్ ప్లేయర్స్ కేటగిరీలో వేలంలోకి వచ్చిన మిలింద్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఆక్షన్‎లో చివరకు ఖమ్మం ఏసెస్ మిలింద్‎ను సొంతం చేసుకుంది.

సీవీ మిలింద్ క్రికెట్ కెరీర్:

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పెద్ద కుమారుడైన సీవీ మిలింద్ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, బ్యాటరైన మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు ఆడుతున్నాడు. హైదరాబాద్ సీనియర్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇండియా తరఫున U-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మిలింద్. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‎లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లకు ఎంపికయ్యాడు. 

ప్రతిష్టాత్మకంగా టీజీ 20 క్రికెట్ లీగ్:

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా టీజీ 20 లీగ్ నిర్వహిస్తోంది. ఈ లీగ్‎లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. 21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. HCAలో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొ్న్నారు. 

టీమిండియా స్టార్ క్రికెటర్స్ మహ్మద్ సిరాజ్ ,తిలక్ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్ కూడా వేలం బరిలో ఉన్నారు. అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్‌తో పాటు హైదరాబాద్ యువ క్రికెటర్లు కూడా వేలంలో ఉన్నారు.

ప్రతి టీమ్‎కు రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయింపు. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది ప్లేయర్స్‎ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో టీమ్ కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. వేలం ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీల వారీగా జరుగుతుంది. గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహంగా ప్రతి టీమ్‎లో కనీసం 4 జిల్లాల ఆటగాళ్లు ఉండాలి. ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం రెండు జిల్లాల ప్లేయర్స్ ఆడటం తప్పనిసరి.